ప్రముఖ నటుడు సాయికుమార్ తన చుట్టూ ఉన్న వారికి ఏ ఆపద వచ్చినా తనవంతు సాయం అందించడానికి ఎప్పుడూ ముందుంటారు. కరోనా కష్ట కాలంలోనూ తన వంతు సాయం చేశారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో సాయికుమార్ సోషల్ మీడియా ద్వారా ఓ పిలుపునిచ్చారు. కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని, అది వేసుకుంటే ప్రాణాలకు ఢోకా ఉండదని హితవు పలికారు. ‘పోలీస్ స్టోరీ’లోని పాపులర్ డైలాగ్ ను ప్రస్తుత పరిస్థితికి అన్వయిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ‘కనిపించని మూడు సింహాలు మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ అయితే, కనిపించని నాలుగో సింహమే మనోధైర్యం’ అని చెబుతూ, ప్రతి ఒక్కరూ ధైర్యాన్ని అలవరచుకోవాలని సాయికుమార్ అన్నారు. అదే విధంగా అందరూ టీకా వేయించుకోవాలని, అదే మనలను కరోనా నుండి రక్షిస్తుందని తెలిపారు. కరోనా సోకిన వారిలో కొందరు వైద్యం అందక చనిపోతుంటే, చాలా మంది మనోధైర్యం కోల్పోయి గుండెపోటుకు గురి అవుతున్నారు. మరి సాయికుమార్ మాటలతో కొందరైనా మనోధైర్యాన్ని కూడగట్టుకుంటారేమో చూడాలి.