Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!

Rajesh Shara Fauzi

Rajesh Shara Fauzi

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మకు విషపురుగు కరిచింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే, ఈ ప్రచారాన్ని ఖండిస్తూ ఆయన పీఏ సుభాశిష్ పాండా ఒక వీడియో రిలీజ్ చేశారు. రాజేష్ శర్మకు ఎలాంటి తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ లేదని పేర్కొన్న ఆయన, రాజేష్ శర్మకు ఉన్న షుగర్ వల్ల కాలు కొద్దిగా వాచిందని, అందుకే హాస్పిటల్‌లో చేర్పించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగుందని, ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జ్ కూడా అవుతారని సుభాశిష్ పేర్కొన్నారు.

రాజేష్ శర్మకు హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేస్తుండగా ఏదో అయ్యిందని సోషల్ మీడియాలో, కొన్ని మీడియా ఛానల్స్‌లో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అబద్ధమని సుభాశిష్ పాండా స్పష్టం చేశారు. రాజేష్ శర్మ ఎక్కడికి వెళ్లినా ఆయనతో పాటు తాను ఉంటానని, హైదరాబాద్‌లో అలా ఏమీ జరగలేదని, కేవలం కొందరు తమ స్వార్థం కోసం ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. దయచేసి ఇలాంటి నిజానిజాలు తెలియని ఫేక్ న్యూస్‌లను సోషల్ మీడియాలో వైరల్ చేయవద్దని సుభాశిష్ పాండా కోరారు.