Raghubabu : నాన్న చివరి కోరిక తీర్చడానికే ఆ హడావిడి.. అందరికీ క్షమాపణలు చెప్పిన రఘుబాబు!

Giribabu

Giribabu

టాలీవుడ్ సీనియర్ నటుడు గిరిబాబు అస్తమయంతో తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. దశాబ్దాల పాటు తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించిన ఆ మహానటుడు తిరిగిరాని లోకాలకు తరలివెళ్లడం సినీ లోకానికి తీరని లోటు. అయితే, హైదరాబాద్‌లో ఆయన భౌతికకాయాన్ని కేవలం రెండు మూడు గంటలు మాత్రమే ఉంచి, హుటాహుటిన స్వగ్రామానికి తరలించడంపై అభిమానుల్లో, సినీ వర్గాల్లో కొన్ని సందేహాలు తలెత్తాయి. దీనిపై గిరిబాబు తనయుడు, ప్రముఖ నటుడు రఘుబాబు భావోద్వేగంతో స్పందించారు. తండ్రి చివరి కోరికను నెరవేర్చడం కోసమే ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, దూరప్రాంతాల నుంచి వచ్చే అభిమానులు చివరి చూపుకు నోచుకోలేకపోయినందుకు అందరినీ క్షమించమని ఆయన వేడుకున్నారు.
 సాధారణంగా హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు నిర్వహించి ఉంటే, మరుసటి రోజు మధ్యాహ్నం వరకు భౌతికకాయాన్ని ఉంచి దూరప్రాంతాల నుంచి వచ్చే వారందరికీ కడసారి చూపు కల్పించే అవకాశం ఉండేది. కానీ గిరిబాబుకు తన గ్రామం అంటే ప్రాణం. ఆ మట్టిపై ఉన్న మమకారంతో, “నన్ను అక్కడికే తీసుకెళ్ళండి.. నా అంత్యక్రియలు మన సొంత ఊరిలోనే జరగాలి” అని ఆయన గతంలోనే తన కుటుంబ సభ్యుల వద్ద తన చివరి కోరికను బయటపెట్టారట. కన్నతండ్రి ఆఖరి మాటను గౌరవించడం కంటే తమకు ఏదీ ఎక్కువ కాదని భావించిన రఘుబాబు కుటుంబం, సమయాభావం వల్ల ఆస్పత్రి ఫార్మాలిటీస్ పూర్తి కాగానే కేవలం రెండు మూడు గంటలు మాత్రమే హైదరాబాద్‌లో ఉంచి భౌతికకాయాన్ని స్వగ్రామానికి తరలించింది.
 తక్కువ సమయంలోనే విషయం తెలుసుకుని హైదరాబాద్‌లోని నివాసానికి తరలివచ్చిన బంధుమిత్రులు, సినీ ప్రముఖులు శివాజీ రాజా, విష్ణు, నెహ్రూతో పాటు ఫోన్ ద్వారా పరామర్శించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులకు రఘుబాబు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. హడావిడిగా తరలించడం వల్ల చివరి చూపు దక్కని అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ ఆయన చేతులు జోడించి క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా, హైదరాబాద్‌లోనే త్వరలో ఒక ప్రత్యేక సంస్మరణ సభ (కండోలెన్స్ మీట్) ఏర్పాటు చేస్తామని, ఆ రోజు ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా కలుస్తానని రఘుబాబు వెల్లడించారు. తండ్రిని కోల్పోయిన పుట్టెడు దుఃఖంలోనూ, అభిమానుల మనోభావాలను అర్థం చేసుకుని రఘుబాబు మాట్లాడిన తీరు అభినందనీయం.