ప్రస్తుతం ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా చేస్తోన్న ఆమీర్ ఖాన్ లాక్ డౌన్ తరువాత మళ్లీ షూటింగ్ మొదలు పెట్టాడు. హాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’కి ‘లాల్ సింగ్ చద్దా’ అఫీషియల్ రీమేక్. అయితే, ప్రస్తుతం ఆమీర్ చేస్తోన్న సినిమా తరువాత ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటని ఎవరికీ క్లారిటీ లేదు. ఎటువంటి రూమర్స్ కూడా లేవు. అయితే, తాజాగా ఆయన ఆన్ లైన్ ఛాట్ ఒక దాంట్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. పైగా ఆ కామెంట్స్ లో చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ పేరు కూడా ఉండటంతో నెటిజన్స్ ఆసక్తి మరింత పెరిగింది!
ఆమీర్ ఖాన్ కు చెస్ అంటే ఇష్టం. ఆయనకు విశ్వనాథన్ అనంద్ తోనూ మంచి అనుబంధం ఉంది. దాంతో ఒకటి రెండు సార్లు వారిద్దరూ ఫేస్ టూ ఫేస్ చెస్ గేమ్స్ ఆడారు కూడా! అయితే, లెటెస్ట్ గా జరిగిన ఓ ఆన్ లైన్ మీట్ లో మరికొందరు ప్రముఖులతో పాటూ వీరిద్దరు కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో ‘విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్’ చర్చకు రాగా… ఆమీర్ ఖాన్ ‘మరో ఆలోచన లేకుండా తాను వెండితెరపై విశ్వనాథన్ ఆనంద్ గా నటిస్తా’నని అన్నాడు! అంతే కాదు, ఆయన మైండ్ ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోటానికిగానూ విశ్వనాథన్ తో వీలైనంత ఎక్కువ సేపు గడుపుతానని పేర్కొన్నాడు. ఆయన భార్యని, కుటుంబ సభ్యుల్ని కూడా సంప్రదించి చెస్ గ్రాండ్ మాస్టర్ రోజు వారీ ప్రవర్తన ఎలా ఉంటుందో అధ్యయనం చేస్తానని ఆమీర్ చెప్పాడు. విశ్వనాథన్ ఆనంద్ తన పాత్రని తాను బిగ్ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఆశ్చర్యపోయేలా నటించే ప్రయత్నం చేస్తానని పర్పెక్షనిస్ట్ అన్నాడు.
విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్ అనగానే ఆమీర్ ఉత్సాహం చూపటం, తాను ఎలా ప్రిపేర్ అవుతాడో కూడా చెప్పటం… ఇదంతా అప్ కమింగ్ ప్రాజెక్ట్ కోసమేనంటున్నారు కొందరు ఆన్ లైన్ అబ్జర్వర్స్. చూడాలి మరి, చదరంగ వీరుడిగా ఆమీర్ ఎలాంటి ఎత్తులు, పైఎత్తులు వేసి సినిమాని రక్తి కట్టిస్తాడో…