AK 47 Release Date Leaked: విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఆదర్శకుటుంబం : ఏకే – 47’. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడి అభిమానులను ఊరిస్తున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని వెంకీ మామా అభిమానులతో పాటు సినీ ప్రియులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ చేసిన ఒక చిన్న పొరపాటు ఇప్పుడు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సిన రిలీజ్ డేట్‌ను తమన్ అనుకోకుండా లీక్ చేసేశారు. అసలేం జరిగిందంటే.. సినిమాకు సంబంధించిన సంగీత పనులు పూర్తయిన సంతోషాన్ని పంచుకుంటూ తమన్ సోషల్ మీడియా వేదికగా ఒక అప్‌డేట్ ఇచ్చారు. అయితే ఆ ఉత్సాహంలో సినిమా ఎప్పుడు వస్తుందో చెబుతూ “అక్టోబర్ 30” అనే డేట్‌ను క్యాప్షన్‌లో రాసేశారు.
ఆ తర్వాత తన పొరపాటును గ్రహించి వెంటనే ఆ పోస్ట్‌ను ఎడిట్ చేసి, తేదీ ఉన్న చోట ఒక ఎమోజీని పెట్టేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నెటిజన్లు, సినీ అభిమానులు ఆ పోస్ట్‌ను క్షణాల్లో స్క్రీన్‌షాట్లు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు. దీంతో ‘ఆదర్శకుటుంబం’ అక్టోబర్ 30న థియేటర్లలోకి దిగబోతోందన్న వార్త ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. నిజానికి ఈ సినిమా మొదట గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల దీనిని అక్టోబర్ 9కి రీషెడ్యూల్ చేశారు. తీరా చూస్తే ఆ తేదీకి కూడా సినిమా రావడం లేదని, పనులు పూర్తికాగానే కొత్త డేట్‌ను అనౌన్స్ చేస్తామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పష్టం చేశారు. ఇలా వరుస వాయిదాలతో నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌కు తమన్ ఇచ్చిన ఈ లీక్ ఇప్పుడు ఫుల్ కిక్ ఇస్తోంది. తమన్ ఎడిట్ చేసినప్పటికీ, అక్టోబర్ 30నే వెంకీ-త్రివిక్రమ్ మేనియా మొదలుకానుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. మరి తమన్ లీక్ చేసిన ఈ తేదీపై చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి అధికారిక ముద్ర ఎప్పుడు పడుతుందో చూడాలి.

