ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా థియేటర్ల పరిస్థితి దయనీయంగా మారుతోందా? కళ్ల ముందే వందల సంఖ్యలో థియేటర్లు కనుమరుగవుతున్నాయా? అంటే అవుననే అంటున్నారు ఏపీఎఫ్‌డీసీ (APFDC) చైర్మన్ భరత్ భూషణ్. విజయవాడలో జరిగిన ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరమ్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కేవలం మూడు, నాలుగు నెలల వ్యవధిలోనే ఏపీలో సుమారు 400 థియేటర్లు మూతపడటం ఎగ్జిబిషన్ రంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 2,000 పైగా థియేటర్లు కళకళలాడుతుండగా.. ఇప్పుడు ఆ సంఖ్య సుమారు 1,200కు పడిపోయిందని భరత్ భూషణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే థియేటర్లు నడవాలంటే కేవలం టికెట్ రేట్లు పెంచడం ఒక్కటే శాశ్వత పరిష్కారం కాదని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వం టికెట్ ధరల పెంపుపై సానుకూలంగా ఉన్నప్పటికీ, వెంటనే శాశ్వత జీవో వస్తుందని ఆశించవద్దన్నారు. ముఖ్యంగా టికెట్ ధరల పెంపు విషయంలో ఎగ్జిబిటర్లు అత్యాశకు పోకూడదని, ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయాలని ఆయన సున్నితంగా హెచ్చరించారు.
థియేటర్ల మనుగడ కోసం ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని భరత్ భూషణ్ భరోసా ఇచ్చారు. ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన లైసెన్సుల రెన్యువల్ పై కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఫైర్, సినిమాటోగ్రఫీ వంటి వేర్వేరు శాఖల లైసెన్స్ గడువులు ఒకేసారి ముగియకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీన్ని పరిష్కరించేందుకు అన్ని శాఖలకు కలిపి 5 ఏళ్ల కాలపరిమితితో ‘సింగిల్ విండో’ విధానంలో లైసెన్స్ రెన్యూవల్స్ ఇచ్చేలా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లామని, వారి నుంచి సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు. థియేటర్ల నిర్వహణ భారాన్ని తగ్గించేందుకు, టూరిజం, హోటల్ రంగానికి ఇస్తున్నట్లుగానే సినిమా థియేటర్లకు కూడా ‘ఇండస్ట్రియల్ పవర్ టారిఫ్’ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఆయన చెప్పారు. పెరుగుతున్న కరెంట్ బిల్లులు, సిబ్బంది జీతాలు, థియేటర్ల రెనోవేషన్ ఖర్చుల దృష్ట్యా నిర్వహణ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అనే తేడా లేకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా ‘యూనిఫామ్ టికెట్ ధరల’ విధానాన్ని సమీక్షించాలని కోరామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,197 మంది ఎగ్జిబిటర్లు ఏకతాటిపైకి వచ్చి, ఎఫ్‌డీసీలో మెంబర్షిప్ తీసుకుంటే సమస్యల పరిష్కారం మరింత సులభం అవుతుందని చైర్మన్ పిలుపునిచ్చారు. ఎగ్జిబిటర్లు, నిర్మాతలు, ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తేనే ఈ సంక్షోభం నుంచి థియేటర్ వ్యవస్థను కాపాడుకోగలమని ఆయన స్పష్టం చేశారు.

