తమిళ చిత్రం ’96’కు తెలుగు సీక్వెల్ గా తెరకెక్కింది ‘జాను’. సమంత, శర్వానంద్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా తమిళంలోని మ్యాజిక్ ను తెలుగులో రిపీట్ చేయలేకపోయింది. నిజానికి అది అసాధ్యమని సమంత భావించినా, నిర్మాత ‘దిల్’ రాజు మాట కాదనలేక ఆమె ‘జాను’లో నటించింది. చివరకు సమంత భయమే నిజమైంది. ఈ సినిమా ఇలా వచ్చి, అలా వెళ్ళిపోయింది. చాలామందికి ‘జాను’ వంటి సినిమా ఒకటి వచ్చిందని కూడా గుర్తులేదు. చిత్రం ఏమంటే… అందులో తన మనసుకు తగ్గట్టుగా లైఫ్ ను లీడ్ చేసే కథానాయకుడు రామ్ మీద ఓ పాట చిత్రీకరించారు. ‘ది లైఫ్ ఆఫ్ రామ్’ అనే ఈ పాట అతని స్వభావాన్ని తెలియచేసేది. ఈ పాటకు యూట్యూబ్ లో వంద మిలియన్ వ్యూస్ దక్కాయి. మిడిల్ ఏజ్డ్ మ్యాన్ గా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో శర్వానంద్ ఈ పాటలో కనిపిస్తాడు. గోవింద్ వసంత స్వరాలకు తగ్గట్టుగా ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి పాట రాయగా, ప్రదీప్ కుమార్ పాడాడు. ఈ పాట కోసం ఎంపిక చేసుకున్న లొకేషన్లు కూడా చాలా బాగుంటాయి. వాటిని మహేంద్రన్ జయరాజ్ మరింత అందంగా తెర మీద ప్రెజెంట్ చేశాడు. సినిమాను జనాలు వెండితెరపై చూడకపోయినా… ఈ పాటను మాత్రం డిజిటల్ ప్లాట్ ఫామ్ లో బాగానే ఆదరించారని ఈ వ్యూస్ చూస్తుంటే తెలుస్తోంది. ఇక ఇటీవలే శర్వానంద్ నటించిన ‘శ్రీకారం’ మూవీ విడుదల కాగా, ‘మహా సముద్రం’, ‘ఆడాళ్ళు మీకు జోహర్లు’తో పాటు మరో బైలింగ్వల్ మూవీ సెట్స్ పై ఉంది.