తెలుగు చిత్రసీమను ఏలిన నృత్య దర్శకుల్లో శివశంకర్ మాస్టర్ శైలి విభిన్నం! శాస్త్రీయ రీతుల్లోనూ, జానపద బాణీల్లోనూ నృత్యభంగిమలు కూర్చి ప్రేక్షకులను రంజింప చేయడంలో మేటిగా నిలిచారు శివశంకర్. ఆయనకు సింగిల్ కార్డులు తక్కువేమీ కాకున్నా, సింగిల్ సాంగ్స్ తోనే పలు మార్లు భళా అనిపించారు. తెలుగునాట శివశంకర్ శిష్యప్రశిష్యులు ఎందరో రాజ్యమేలుతున్నారు. వారితోనూ పోటీపడి నర్తనంలో భళా అనిపించారు మాస్టర్. భావి నృత్యకళాకారులకు శివశంకర్ మాస్టర్ దిశానిర్దేశం చేస్తూ పలు సలహాలు, సూచనలతో అనేక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. అలా వేలాదిమంది శిష్యులను పోగేసుకున్న శివశంకర్ మాస్టర్ వారందరినీ దుఃఖసాగరంలో ముంచేస్తూ సెలవంటూ కార్తికమాసాన కైలాసవాసునిలో ఐక్యమయ్యారు. ఎంతయినా ఈయన పేరూ శివశంకరుడే కదా, అందువల్లేనేమో నటరాజు, ఈ నాట్యాచార్యుని కార్తికంలోనే తనలో లీనం చేసుకున్నారు.
Read Also : “రాధేశ్యామ్” ఆషికి ఆగయి… సెకండ్ సింగిల్ ప్రోమో
కళ్యాణ సుందరం శివశంకర్ 1948 డిసెంబర్ 7న చెన్నైలోని ప్యారిస్ లో గోవిందప్ప వీధిలో జన్మించారు. ఆయన తండ్రి కళ్యాణ సుందరం, తల్లి కోమల అమ్మాల్. బాల్యంలోనే శివశంకర్ కు వెన్నుపూస విరిగింది. దాంతో ఇంట్లో నుంచే చదువు సాగించారు. తరువాత హిందూ థియలాజికల్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో చదివారు. చిన్నతనంలో బెడ్ లోనే చాలా కాలం ఉన్న సమయంలో ఆయన అత్తలు, పిన్నమ్మలు సేవలు చేశారు. బాల్యంలో ఎక్కువగా ఆడవారితోనే మసలడం వల్ల శివశంకర్ లోనూ ఆడవారిలా నడిచే అలవాటు ఏర్పడింది. ఓ సారి తండ్రితో కలసి డాన్స్ ఫెస్టివల్ కు వెళ్ళిన శివశంకర్ లో నాట్యం పట్ల అభిలాష కలిగింది. మైలాపూర్ లోని నటరాజ్, శకుంతల వద్ద నాట్యంలో శిక్షణ పొందారు. కొన్ని చిత్రాలలో గ్రూప్ డాన్సుల్లో పాల్గొన్నారు. 1974లో ప్రముఖ నృత్య దర్శకులు సలీమ్ మాస్టర్ వద్ద అసిస్టెంట్ గా చేరారు.
సలీమ్ మాస్టర్ వద్ద అసిస్టెంట్ గా ఉన్న రోజుల్లో ఆయన నుండి హీరోల ఇమేజ్ ను బట్టి డాన్సులు ఎలా కంపోజ్ చేయాలో నేర్చుకున్నారు. 1975 నుండి దాదాపు పదేళ్ళ పాటు సలీమ్ మాస్టర్ దక్షిణ భారత సినీ పరిశ్రమను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలారు. ఆ సమయంలో తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ చిత్రాలలో శివశంకర్ అనేక మంది స్టార్స్ కు డాన్స్ కంపోజ్ చేసే అవకాశం లభించింది. యన్టీఆర్ కు ఎక్కువగా సలీమ్ మాస్టరే స్వయంగా నృత్య రీతులు అభ్యాసం చేయించేవారు. ఆయన పర్యవేక్షణలో ‘వేటగాడు’లోని “పుట్టింటోళ్ళు తరిమేశారు…” పాటకు శివశంకర్ శాస్త్రీయ నృత్యాన్ని పొందు పరిచారు. ఆ తరువాత ఏయన్నార్ నటించిన అనేక చిత్రాలలో సలీమ్ మాస్టర్ లేకున్నా, తానే నృత్యభంగిమలు సమకూర్చిన సందర్భాలున్నాయి. ఇక చిరంజీవిని స్టార్ గా నిలిపిన ‘ఖైదీ’లోనూ సలీమ్ మాస్టర్ అసోసియేట్ గా జనం మెచ్చే భంగిమలు రూపొందించారు శివశంకర్. సలీమ్ వద్ద శివశంకర్ తో పాటు శివ-సుబ్రహ్మణ్యం దంపతులు కూడా అసిస్టెంట్స్ గా పనిచేశారు. తరువాతి రోజుల్లో వీరందరూ కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ వంటి మేటి డాన్స్ హీరోలకు నృత్యరీతులు రూపొందించి, తమకంటూ ఓ గుర్తింపు సంపాదించారు. ఏ పాటలోనైనా తన మార్క్ కనిపించడానికి, పాట పూర్తయ్యేలోగా ఎక్కడో ఓ చోట శాస్త్రీయ నృత్యభంగిమను పొందుపరచేవారు శివశంకర్. తరువాత అదే శివశంకర్ మాస్టర్ మార్క్ గా మారింది.
Read Also : నాని కొత్త ట్రెండ్… అభిమానుల కోసమే మరి !
నాట్యంలో ప్రవేశమున్నవారికి శివశంకర్ మాస్టర్ తో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉండేది. ఇక డాన్స్ లో ఏ మాత్రం శిక్షణ లేనివారికి, శివశంకర్ మాస్టర్ కోచింగ్ ఓ పెద్దబాల శిక్షలా పనిచేసేది. కొత్తలో కొందరు హీరోయిన్లు “శివశంకర్ మాస్టర్ పర్ ఫెక్షనిస్ట్… ఆయనతో పనిచేయడం చాలా కష్టం…” అనేవారు. కానీ, ఆయన వద్ద ఒక్కసారి పనిచేసిన తరువాత ఇతర నృత్య దర్శకులతో పనిచేయడం ఎంతో సులువు అనీ వారే మళ్ళీ చెప్పుకొనేవారు. అదీ శివ శంకర్ మాస్టర్ శైలి. అందువల్లే కొన్ని ప్రత్యేక పాటలకు శివశంకర్ మాస్టర్ నే ఎంచుకొనేవారు దర్శకులు. అలా రాజమౌళి తన ‘మగధీర’ చిత్రంలోని “ధీర ధీర ధీర…” పాటకు శివశంకర్ మాస్టర్ ను ఎంచుకున్నారు. ఆ పాటకు ఆయన రూపొందించిన నృత్యభంగిమలు చూపరులను కట్టిపడేశాయి. ఆ పాటతోనే జాతీయ స్థాయిలో ఉత్తమ నృత్య దర్శకునిగా నిలిచారు శివశంకర్. ఆయన నృత్యానికి పలు అవార్డులు, రివార్డులు లభించాయి. దాదాపు 800 చిత్రాలలో పనిచేసినా, అప్పట్లో వారి ఆదాయం చాలా తక్కువ. ఇప్పుడున్న డాన్స్ మాస్టర్స్ పారితోషికంతో పోల్చిచూస్తే, ఆ రోజుల్లో శివశంకర్ అందుకున్నది చాలా స్వల్పం అనిపిస్తుంది. ఎంతో కీర్తినయితే గడించారు కానీ, ఆర్థికంగా అంత బలాన్ని పుంజుకోలేకపోయారు శివశంకర్ మాస్టర్. అందువల్లే ఆయన అనారోగ్యం పాలయిన సమయంలో చిరంజీవి, ధనుష్, సోనూ సూద్, మంచు విష్ణు లాంటివారు ఆర్థిక సాయం అందించారు. అయినా మాస్టర్ ప్రాణాలు దక్కలేదు. శివశంకర్ మరణవార్త తెలుగు సినిమా రంగాన్ని శోకసముద్రంలో ముంచెత్తింది. కానీ, ఆయన నృత్యరీతులు సమకూర్చిన గీతాలను చూస్తే, మాస్టర్ ప్రతిభను తలచుకుంటూ ఆ బాధను కొంతయినా మరచిపోవచ్చు. ఏది ఏమైనా చిత్రసీమలో నాట్యం గురించిన ప్రస్తావన వచ్చినపుడల్లా శివశంకర్ మాస్టర్ పేరు తప్పకుండా వినిపించి తీరుతుందని చెప్పవచ్చు.
