Chitra Birthday Special :
కొందరు కళాకారులను చూస్తే ఏ శాపవశాన వారు భూలోకంలో అవతరించారో అనిపిస్తుంది. లేక ప్రజల అదృష్టవశాన వారు ఇలకు దిగివచ్చారనీ అనిపించక పోదు. అలాంటి అరుదైన కళాకారుల్లో సదా మధురం పంచి మనకు ఆనందం అందించిన గాయనీగాయకులెందరో ఉన్నారు. ‘కర్మభూమి’గా పేరు గాంచిన భరతఖండం అలాంటి కళాకారులకు నెలవు. అందునా ‘దైవభూమి’గా నిలచిన కేరళలోనే గానగంధర్వులు వెలయడం ఓ అబ్బురపరిచే అంశం! అత్యధిక పర్యాయాలు జాతీయ స్థాయిలో ఉత్తమగాయకునిగా నిలచిన కె.జే.ఏసుదాస్, ఉత్తమగాయనిగా వెలిగిన కె.యస్.చిత్ర ఇద్దరూ మళయాళ సీమలోనే జన్మించడం విశేషం! ఇప్పటికి ఆరు సార్లు ఉత్తమగాయనిగా జాతీయ అవార్డును అందుకున్నారు చిత్ర. ఏ భాషలో పాట పాడినా సదరు భాషాభిమానులకు మహదానందం పంచడమే చిత్రకు తెలిసిన విద్య! అందుకే ఆమెను అవార్డులు, రివార్డులు వరిస్తూ వచ్చాయని చెప్పవచ్చు.
కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర 1963 జూలై 27న కేరళలోని ట్రివేండ్రంలో కన్నుతెరిచారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు ఈ గానకోకిలలోని మాధుర్యం కనుగొన్న కన్నవారు చిన్నతనంలోనే ఆమెకు సంగీతం నేర్పించారు. కె.ఒమనకుట్టి వద్ద శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకున్న చిత్ర బి.ఏ. సంగీతంలో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. యూనివర్సిటీ ఆఫ్ కేరళలో సంగీతంలో మాస్టర్స్ డిగ్రీ కూడా చేశారామె.
తరువాత చిత్రసీమలో అవకాశాల కోసం వెతుకులాట సాగించకుండానే చిత్రను సినిమా రంగం ఎర్రతివాచీ వేసి ఆహ్వానించింది. ఇళయరాజా స్వరకల్పనలో చిత్ర గళవిన్యాసాలు పండితపామర భేదం లేకుండా అలరించాయి. మాతృభాష మళయాళంలోనే కాదు తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ చిత్ర మధురం పంచి మహదానందం కలిగించారు.
జాతీయ స్థాయిలో అత్యధిక పర్యాయాలు ఉత్తమగాయనిగా ఐదుసార్లు నిలిచారు పి.సుశీలమ్మ. ఆమె రికార్డును చిత్ర ఆరు అవార్డులతో అధిగమించారు. 1985లో ఇళయరాజా స్వరకల్పనలో ‘సింధుభైరవి’ తమిళ చిత్రంతో “పాడరియేన్ …”, “నాన్ ఒరు సింధు…” పాటలతో తొలిసారి బెస్ట్ సింగర్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు చిత్ర. తరువాతి సంవత్సరం బాంబే రవి స్వరకల్పనలో మళయాళ చిత్రం ‘నఖక్షతంగళ్’ చిత్రంలోని “మంజల్ ప్రసాదవుమ్…” పాటతో రెండోసారి జాతీయ స్థాయిలో ఉత్తమగాయనిగా నిలిచారామె. 1988లో ‘వైశాలి’ మళయాళ సినిమాలో “ఇందు పుష్పమ్…చూడి నిల్కుమ్…” పాటతో మూడో సారి నేషనల్ అవార్డు దక్కించుకున్నారు. ఈ చిత్రానికి కూడా బాంబే రవి స్వరకల్పన చేశారు. 1996లో ఏ.ఆర్. రహమాన్ బాణీల్లో రూపొందిన ‘మిన్సార కనవు’లోని “మాన మదురై…” పాటతో నాలుగో సారి నేషనల్ అవార్డు అందుకున్నారామె. మరుసటి సంవత్సరం హిందీ చిత్రం ‘విరాసత్’లో అనుమాలిక్ బాణీలకు తగ్గరీతిలో “పాయలేన్ చున్ మున్…” పాట పాడి ఐదవ జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు చిత్ర. 2004లో తమిళ చిత్రం ‘ఆటోగ్రాఫ్’లో భరద్వాజ్ స్వరకల్పనలో “ఒవ్వూరు పూకలుమె…” సాంగ్ తో ఆరోసారి నేషనల్ అవార్డును కైవసం చేసుకున్నారామె.
ఇక రాష్ట్రస్థాయిల్లోనూ చిత్ర గానానికి రికార్డు స్థాయిలోనే అవార్డులు లభించాయి. తెలుగునాట చిత్ర గళంలో జాలువారిన పాటలకు రాష్ట్రప్రభుత్వ, సాంస్కృతిక కళా సమితులు అందించిన అవార్డులకు లెక్కలేదు. 1990లో ‘సీతారామయ్యగారి మనవరాలు’లో కీరవాణి బాణీలకు అనువుగా తన గళాన్ని”కలికిచిలకల కొలికి…” పాట కోసం సవరించుకొని తొలిసారి నంది అవార్డును అందుకున్నారామె. తరువాత వరుసగా మరో మూడు సంవత్సరాలు అంటే 1991లో ‘రాజేశ్వరి కళ్యాణం’తోనూ, 1992లో ‘సుందరకాండ’తోనూ, 1993లో ‘మాతృదేవోభవ’తోనూ చిత్ర ఉత్తమగాయనిగా నంది అవార్డులు సొంతం చేసుకొని అందరినీ అబ్బుర పరిచారు. వరుసగా నాలుగు నందులు అందుకున్న ఏకైక గాయనిగా చిత్ర నిలిచారు. ఆ నాలుగు చిత్రాలకు కీరవాణి స్వరకల్పన చేయడం విశేషం! తరువాత ‘మావిచిగురు’ (1996), ‘బొంబాయి ప్రియుడు’ (1997), ‘అన్వేషిత’ (1998), ‘స్వయంవరం’ (1999), ‘వర్షం’ (2004), ‘కలవరమాయె మదిలో’ (2009), ‘ముకుంద’ (2014) చిత్రాలతోనూ ఉత్తమగాయనిగా చిత్ర నందులను సొంతం చేసుకున్నారు. ఇలా పదకొండు సార్లు నందిని అందుకున్నఘనత చిత్ర సొంతం కాగా, స్వరాష్ట్రం కేరళలో కూడా 16 సార్లు ప్రభుత్వ అవార్డులు అందుకొని రికార్డు నెలకొల్పారామె.
ఇప్పటి దాకా పాతికవేలకు పైగా పాటలు పాడి అలరించారు చిత్ర. కేంద్రప్రభుత్వం ఆమెను ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్’ పురస్కారాలతో గౌరవించింది. బ్రిటిష్ పార్లమెంట్ ‘హౌస్ ఆఫ్ కామన్స్’లో గౌరవం పొందిన తొలి భారతీయ మహిళగానూ చిత్ర చరిత్ర సృష్టించారు. ఇలా ఎన్నెన్నో పురస్కారాలు ఈ గానకోకిల గళమాధుర్యాన్ని మెచ్చి వచ్చి మరీ గౌరవించాయి. భవిష్యత్ లో చిత్ర మరింతగా తన మధురంతో మనందరినీ పరవశింప చేస్తారని ఆశిద్దాం.