యావత్ సినీ అభిమానులు ఆర్ఆర్ఆర్ కోసం ఎంతగా ఎదురుచూశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో వాయిదాల తరువాత మార్చి 25న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను వీక్షించి తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఇక తాజాగా మెగా ఫ్యామిలీ ఆర్ఆర్ఆర్ సినిమాను వీక్షించింది. ఏఎంబి మాల్ లో మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ, ఆయన తల్లి అంజనీ దేవితో సహా ఈ సినిమాను వీక్షించారు.
ఇక ఈ సినిమా వీక్షించిన తరువాత చిరు ట్విట్టర్ వేదికగా తన స్పందనను తెలియజేశారు. ” ఆర్ఆర్ఆర్ మాస్టర్ స్టోరీ టెల్లర్ నుండి వచ్చిన మాస్టర్ పీస్. రాజమౌళి అసమానమైన ప్రతిభకు, సినిమాటిక్ విజన్ కు ఇది సాక్ష్యం. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం మొత్తానికి హ్యాట్సాఫ్” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
