Chiranjeevi Yamudiki Mogudu Completed 35 Years: తెలుగు చిత్రసీమలో ఈ నాటికీ మహానటుడు యన్టీఆర్ సినిమాల సూత్రాలనే అనుసరిస్తూ సినిమాలు రూపొందుతూ ఉండడం విశేషం! మూడున్నర దశాబ్దాల క్రితం బ్లాక్ బస్టర్ గా నిలచిన చిరంజీవి ‘యముడికి మొగుడు’కు కూడా యన్టీఆర్ చిత్రాలే స్ఫూర్తి. అంతకు ముందు రామారావు నటించిన “దేవాంతకుడు, యమగోల” చిత్రాల స్ఫూర్తితోనే చిరంజీవితో ‘యముడికి మొగుడు’ చిత్రం రూపొందింది. చిరంజీవికి ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో చదివే రోజుల్లో మిత్రులైన సుధాకర్, హరిప్రసాద్ తో పాటు నారాయణరావు కూడా తోడై రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ‘యముడికి మొగుడు’ నిర్మించారు. డైనమిక్ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందిన ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయగా, ఆయన సరసన విజయశాంతి, రాధ నటించారు. 1988 ఏప్రిల్ 29న విడుదలైన ‘యముడికి మొగుడు’ ఆ యేడాది బిగ్ హిట్ గా నిలచింది.
‘యముడికి మొగుడు’ కథ ఏమిటంటే – కోటప్ప, కైలాసం వ్యాపారంలో ప్రత్యర్థులే అయినా, ఆప్తమిత్రుల్లా కలుసుకుంటూ ఉంటారు. కాళి అనే రౌడీ మనసున్నవాడు. ఉన్నవారిని దోచి లేనివారికి సాయంచేసే కాళి అంటే ఎంతోమందికి అభిమానం. అతను కోటప్ప నియమిస్తే వెళ్ళి కైలాసంను బెదిరిస్తాడు. అప్పుడే కైలాసం కూతురు రాధ, కాళిని చూసి మనసు పారేసుకుంటుంది. కాళి, రాధ గాఢంగా ప్రేమించుకొని పెళ్ళి చేసుకోవాలను కుంటారు. ఈ విషయం తెలిసిన కైలాసం యాక్సిడెంట్ చేయించి, కాళిని చంపించేస్తాడు. దాంతో కాళి నరకానికి వెళతాడు. అక్కడ యముడు,చిత్రగుప్తునితో కాళి తనను తప్పుగా నరకానికి తీసుకువచ్చారని అంటాడు. తప్పును సరిదిద్దుకోవడానికి యముడు, చిత్రగుప్తుడు భూలోకం వెళ్ళి కాళి దేహం కోసం గాలిస్తారు. అప్పటికే కాళి పార్థివదేహానికి దహనసంస్కారాలు జరిగిపోయి ఉంటాయి. వేరే శరీరంలో ప్రవేశించమని యమ,చిత్రగుప్త కోరతారు. అందుకు కాళి అంగీకరించడు. దాంతో అచ్చు కాళి లాగే ఉండే బాలరాజు అనే మనిషి శరీరంలో ప్రవేశించమని అంటారు. అమాయకుడైన బాలరాజు అతని బాబాయి గోపాలరావు చేతిలో పలు పాట్లు పడుతుంటాడు. అతని అడ్డు తొలగించుకొని ఆస్తి కాజేయాలని గోపాలరావు, అతని కొడుకు ఆశిస్తారు. ఈ లోగా బాలరాజు శరీరంలో కాళి ప్రవేశించడం జరుగుతుంది. అక్కడ నుంచీ బాబాయ్, ఆయన కొడుకు ఇద్దరి భరతం పడతాడు బాలరాజులోని కాళి. బాలరాజు నేస్తం గౌరికి భలే ఆనందం కలుగుతుంది. బాలరాజును చంపాలని ప్రయత్నిస్తాడు గోపాలరావు. దానిని బయట పెడతాడు బాలరాజు. ఇంట్లోంచి గెంటేయగా బాబాయ్, ఆయన కొడుకు కలసి పట్నంలోని తమ మిత్రులు కైలాసంను కలుసుకుంటారు. అక్కడికీ బాలరాజులోని కాళి వెళతాడు. చనిపోయినవాడు ఎలా బతికి వచ్చాడో తెలియక కైలాసం తికమక పడతాడు. అందరూ కలసి మళ్ళీ బాలరాజును చంపాలని చూస్తారు. బాలరాజు తల్లిని, గౌరిని కట్టేసి చంపాలనుకుంటారు. అలాగే భూలోకంలో కాళి ఆయుర్దాయం తీరిపోయింది కాబట్టి, మళ్ళీ నరకానికి రమ్మంటారు యమధర్మరాజు, చిత్రగుప్తుడు. అతని కోసం ప్రాణం పెట్టుకున్న రాధ, గౌరి కోసం బాలరాజుతో పాటు కాళి ఆత్మను కూడా ఉండమనే చెబుతారు యమధర్మరాజు. ఈ శరీరం ఒకరిది, ఆత్మ నాది వారిద్దరిలో ఎవరి చేసుకోవాలని బాలరాజులోని కాళి అడుగుతాడు. అందుకు అతని చెవిలో యమధర్మరాజు ఓ దేవరహస్యం చెబుతాడు. రాధ, గౌరి ఎవరో ఒకరు త్యాగం చేయాలని భావిస్తారు. అయితే వారి చెవుల్లోనూ యమధర్మరాజు తనకు చెప్పిన దేవరహస్యం చెబుతాడు బాలరాజులోని కాళి. ఇద్దరు ముద్దుగుమ్మలు అతణ్ణి కౌగిలించుకుంటారు. వారిని యమధర్మరాజు, చిత్రగుప్తుడు, విచిత్రగుప్తుడు ఆశీర్వదించడంతో కథ సుఖాంతమవుతుంది.
సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, సుత్తివేలు, రావు గోపాలరావు, గొల్లపూడి మారుతీరావు, కోట శ్రీనివాసరావు, సుధాకర్, ప్రసాద్ బాబు, సూర్యకాంతం, అన్నపూర్ణ, వై.విజయ, మమత, నిర్మల, ప్రియాంక, హరిప్రసాద్, శివప్రసాద్ నటించారు. “నాట్యమిదా…” అంటూ సాగే పాటలో అంబిక నర్తించారు. ఈ చిత్రానికి సత్యానంద్ రచన చేయగా, రాజ్-కోటి బాణీలకు అనువుగా వేటూరి సుందరరామ్మూర్తి పాటలు పలికించారు. ఇందులోని “బహుశా నిన్ను బందరులో చూసివుంటా…”, “అందం హిందోళం…”, “ఎక్కు బండెక్కు…”, “వానజల్లు గిల్లుతుంటే…”, “కన్నెపిల్లతోటి వచ్చెనమ్మా…”, “నాట్యమిదా…” అంటూ సాగే పాటలు అలరించాయి.
తెలుగునాట ‘దేవాంతకుడు, యమగోల’ మొదలు అనేక చిత్రాలు యముని పాత్ర నేపథ్యంలో రూపొంది విజయం సాధించాయి. వాటిలో చిరంజీవి ‘యముడికి మొగుడు’ కూడా నిలచింది. ‘యముడికి మొగుడు’ చిత్రం అనేక కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. ‘యముడికి మొగుడు’ చిత్రం డైరెక్టర్ రవిరాజా పినిశెట్టికి తొలి ఘనవిజయం అని చెప్పవచ్చు. అంతకు ముందు రవిరాజా నిర్దేశకత్వంలో రూపొందిన చిత్రాలు ఓ మోస్తరు విజయాన్నే చవిచూశాయి. ఈ సినిమాను తరువాత రజనీకాంత్ హీరోగా ‘అతిశయ పిరవి’పేరుతో తమిళంలో రీమేక్ చేయగా, అక్కడా విజయం సాధించింది. ‘చిరంజీవి’ పేరుతో ‘యముడికి మొగుడు’నే హిందీలో డబ్ చేశారు. చిత్రమేమిటంటే, రజనీకాంత్ ‘అతిశయ పిరవి’ని కొన్నేళ్ళ తరువాత మళ్ళీ తెలుగులో అనువదించారు. అల్లరి నరేశ్ హీరోగా ‘యముడికి మొగుడు’ టైటిల్ లోనే 2012లో ఓ సినిమా వచ్చింది.