తెలుగు సినిమాకి సంక్రాంతి అంటే కేవలం పండగ మాత్రమే కాదు, అది బాక్సాఫీస్ యుద్ధభూమి లాంటిది. కానీ ఈ ఏడాది ఆ యుద్ధం ఏకపక్షంగా మారిపోయింది, మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కలయికలో వచ్చిన “మన శంకర వరప్రసాద్ గారు” సినిమా థియేటర్ల వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. దీన్ని తుపాను అనాలో, సునామీ అనాలో అర్థం కాని రీతిలో వసూళ్ల వర్షం కురుస్తోంది. ఈ సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందంటే, ఈరోజు ఒక్కరోజు కోసమే ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ₹15 కోట్లు దాటేశాయి. చిత్రమేమిటంటే, ఈ సంక్రాంతి రేసులో ఉన్న ఇతర సినిమాలేవీ కనీసం ₹4 కోట్ల మార్కును కూడా దాటలేక పోయాయి. కేవలం నేడే కాదు, రేపటి రోజు బుకింగ్స్ కూడా అప్పుడే ₹10 కోట్ల వైపు పరుగులు తీస్తున్నాయి. డిమాండ్‌ను బట్టి అర్ధరాత్రి, తెల్లవారుజామున షోలు భారీగా పెంచుతున్నారంటేనే మెగాస్టార్ మానియా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: Parvathy: పీరియడ్స్’లో ఉంటే నరకం చూపించారు.. నటి సంచలన ఆరోపణలు
రీ-ఎంట్రీ తర్వాత చిరంజీవి తన సత్తాను మరోసారి చాటుకున్నారు, గతంలో ఖైదీ నంబర్ 150, వాల్తేరు వీరయ్య చిత్రాలతో సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన ఆయన, ఇప్పుడు ‘మన శంకర వరప్రసాద్ గారు’ తో హ్యాట్రిక్ కొట్టారు. చిరంజీవి సినిమా బరిలో ఉంటే మిగిలిన సినిమాలకు పోటీ ఇచ్చే అవకాశం కూడా లేకుండా ఏకపక్షంగా బాక్సాఫీస్‌ను ఏలేయడం ఆయనకు మాత్రమే చెల్లింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఎన్ని సినిమాలు ఉన్నా, ప్రేక్షకుల చూపు మాత్రం ‘శంకర వరప్రసాద్’ పైనే ఉంది. సినిమా చూసిన వారి పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ వెరసి.. ఒకసారి చూసిన వాళ్లు కూడా మళ్ళీ మళ్ళీ చూడాలని ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఫుట్‌ఫాల్స్ ఊహించని రేంజ్‌లో నమోదవుతున్నాయి. ఆదివారం వరకు ఈ జోరుకు అడ్డుకట్ట వేసే శక్తి ఎవరికీ లేదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తానికి, 2026 సంక్రాంతి విజేతగా మెగాస్టార్ చిరంజీవి నిలిచారు. పండగ విన్నర్.. మన శంకర వరప్రసాద్ గారు!
