Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!

Chiranjeevi

Chiranjeevi

Chiru Leaks: మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ‘కాకా’. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ హిట్ సాధించడంతో ఈ కొత్త చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించి చిరంజీవి స్వయంగా ఇచ్చిన కొన్ని హింట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనంగా మారాయి. పైకి కనిపించే రూపం వేరు.. అసలు వెనుక దాగి ఉన్న చరిత్ర వేరంటూ మెగాస్టార్ ఇచ్చిన లీక్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి.. ‘కాకా’లో తన పాత్ర పేరు కదిరి కాళిదాస్ అని వెల్లడించారు. ప్రస్తుతం ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ప్రచారం అవుతున్న కథనాల ప్రకారం.. ఈ సినిమాలో మెగాబాస్ రెండు భిన్నమైన పార్శ్వాలున్న పాత్రను పోషిస్తున్నారట.

బయటి ప్రపంచానికి ఆయన ‘సత్యం’.. ఒక సాధారణ ఆక్వా ఫ్యాక్టరీలో పనిచేసే సూపర్‌వైజర్. చూడ్డానికి అమాయకంగా, బాధ్యతగల సాధారణ పౌరుడిగా కనిపించే ఈ సత్యం వెనుక, చీకటి ప్రపంచాన్ని శాసించే ‘కదిరి కాళిదాస్’ అనే అండర్‌వరల్డ్ డాన్ ఉన్నాడనే పాయింట్ కథలో ప్రకంపనలు సృష్టించనుందని తెలుస్తోంది. ఈ డ్యూయల్ షేడ్ ట్రాక్ మాస్ ఆడియన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టడం ఖాయం అని అంటున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు మాత్రమే కాకుండా, ఈ కథకు అసలైన బలం తండ్రీకూతుళ్ల ఎమోషన్ అని తెలుస్తోంది. మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ ఇందులో మెగా డాటర్‌ ‘అమ్ములు’ పాత్రలో కనిపించనుంది. మెడిసిన్ చదివే కూతురి కోసం ప్రాణమిచ్చే తండ్రిగా చిరంజీవి నటన, వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులను కంటతడి పెట్టించడం ఖాయం అని అంటున్నారు. అసలు అండర్‌వరల్డ్‌ను శాసించే కదిరి కాళిదాస్, సాధారణ సత్యంగా మారి కూతురి కోసం ఎందుకు బతుకుతున్నాడనే సస్పెన్స్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనుందట. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ వ్యయంతో ఈ మెగా ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.