Raj Nidimoru : హిందీ సినిమాలలో మెగాస్టార్ రిఫరెన్స్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా ?

Chiranjeevi (1)

Chiranjeevi (1)

Raj Nidimoru : భారతీయ సినిమాల్లో కొన్ని పేర్లు నటులుగా మాత్రమే ఉండవు. కోట్లాది అభిమానుల గుండెల్లో నిలిచిపోతాయి. అలాంటి అరుదైన పేర్లలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంత మంది హీరోలు సినిమాలో ఆయన కటౌట్ పెట్టి కలెక్షన్లు కురపించుకున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చిరంజీవి ప్రభావం కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాలేదు. బాలీవుడ్‌లో తెరకెక్కిన కొన్ని వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో కూడా ఆయన పేరు, పాటలు, రిఫరెన్స్‌లు కనిపించడం వెనుక కూడా ఒక స్టోరీ ఉంది.

చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన రాజ్ నిడిమోరు ప్రధానంగా బాలీవుడ్‌లోనే తన సినిమాటిక్ ప్రయాణం సాగిస్తున్నారు. హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లకు రచయితగా, దర్శకుడిగా ఆయన చేసిన కృషి అనేక మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన స్నేహితుడు డీకే (కృష్ణ డీ.కే.)తో కలిసి రాజ్ నిడిమోరు అనేక సక్సెస్‌ఫుల్ ప్రాజెక్టులు అందించారు.ఈ జోడీ తమ రచనల్లో మెగాస్టార్ చిరంజీవి సినిమాలు, పాటలకు ప్రత్యేక స్థానం ఇవ్వడం గమనార్హం.

×
×
Ad

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాజ్ నిడిమోరు ఈ విషయంపై మాట్లాడుతూ,’గన్స్ అండ్ గులాబ్స్‌’లోనూ, ‘గో గోవా గాన్‌’ లోనూ చిరంజీవి గారి పాటలు ఉపయోగించాం. ముఖ్యంగా ‘గన్స్ అండ్ గులాబ్స్‌’ లో ఉత్తర భారతదేశంలో హోటల్ నడుపుతున్న తెలుగు వ్యక్తి ‘ఆత్మారాం’ అనే పాత్రను చూపించాం. కేవలం హిందీ మాత్రమే కాకుండా పాత్రలు తమ సొంత భాషలో మాట్లాడాలని కూడా నిర్ణయించుకున్నాం అని చెబుతూ చిరంజీవి పాపులారిటీ ఏపాటిదో చెప్పారు.

ఆయన మరింత వివరిస్తూ, భారతదేశం నలుమూలల నుంచి నటులను తీసుకోవాలని, వాళ్లు తమ మాతృభాషలోనే మాట్లాడేలా అవకాశం ఇవ్వాలని భావించాం. ఇది మాకు దేశవ్యాప్తంగా టాలెంట్‌ను ఎంపిక చేసుకోవడానికి ఉపయోగపడింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ లో ‘సినిమా బండి’ కనెక్షన్ ఇచ్చాం. అది మా మాతృభాషకు ఇచ్చిన ఒక చిన్న ట్రిబ్యూట్ అని అన్నారు. రాజ్ నిడిమోరు – డీకే జోడీ తమ కథల్లో దక్షిణ భారత సంస్కృతి, సినిమా సంప్రదాయాలను ఇమడ్చడం ద్వారా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. చిత్తూరు నుంచి బాలీవుడ్ వరకు ప్రయాణించిన రాజ్, తన గుర్తింపును, మాతృభాష పట్ల ఉన్న ప్రేమను, చరంజీవిపై ఉన్న అభిమానాన్ని ఇలా తన మాటల్లో చెప్పుకొచ్చారు.