సోషల్ మీడియాలో వేగంగా విస్తరిస్తున్న డీప్‌ఫేక్ టెక్నాలజీ ఇప్పుడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిను కూడా వదల్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ఆయన ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి అశ్లీల రూపంలో మార్చి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్, వెబ్‌సైట్లలో పోస్టు చేసిన ఘటన కలకలం రేపుతోంది. చిరంజీవి ప్రతిష్ఠను దెబ్బతీసేలా తయారుచేసిన ఈ డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫ్ చేసిన ఫోటోలు అనేక సోషల్ మీడియా పేజీల్లో, వెబ్‌సైట్లలో వైరల్ అవుతున్నాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మెగాస్టార్ సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.
Also Read : The Girlfriend : నా హాస్టల్ మెమరీ నుంచి.. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ స్టోరీ పుట్టింది: రాహుల్ రవీంద్రన్
తన ఇమేజ్‌ని దెబ్బతీసేలా చేసిన ఈ చర్యలపై తగిన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని చిరంజీవి కోరారు. ఫిర్యాదు స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా కష్టపడి సంపాదించిన పేరును కేవలం కొన్ని నిమిషాల్లో డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా మసకబార్చడం పట్ల అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో మరోసారి డీప్‌ఫేక్‌ల దుష్ప్రభావం, ఆన్‌లైన్ భద్రతపై చర్చ మొదలైంది. సైబర్ నిపుణులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ “AI సాయంతో వీడియోలు, ఫోటోలు మార్ఫింగ్ చేయడం తీవ్రమైన నేరం. ఇలాంటి కంటెంట్ షేర్ చేసినా, ఫార్వర్డ్ చేసినా చట్టపరమైన చర్యలు తప్పవు” అని పేర్కొన్నారు.