జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో, మరోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నారు. సినిమాల విషయం పక్కన పెడితే ఎన్నికలకు బాగా కష్టపడుతున్నారని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం జన సైనికులను తొలుస్తున్న ప్రశ్న ఒక్కటే.. జనసేనానికి తోడుగా మెగా ఫ్యామిలీ ఉందా..? లేదా అని.. అయితే చిరంజీవి కానీ, చరణ్ కానీ ఎప్పుడు పవన్ వెంటే మేము అని చెప్తూనే ఉన్నారు. ముఖ్యంగా చరణ్.. బాబాయ్ కే మా సపోర్ట్ అంటూ బాహాటంగానే చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా మరోసారి ఆ విషయాన్నీ వ్యక్తపరిచారు. ప్రస్తుతం చరణ్, శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం విదితమే.. ఈ సినిమా ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ జరుపుకొంటుంది. ఈ నేపథ్యంలోనే జనసేన సైనికులు కొంతమంది చరణ్ ని కలిశారు.
ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అయితే వీరు ఈసారి చరణ్ ను కొద్దిగా ఇబ్బంది పెట్టినట్లు వినికిడి. ఎన్నికల్లో పవన్ కు సపోర్ట్ గా ఉంటున్నారా..? లేదా ..? అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడగడంతో చరణ్ కొద్దిగా అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. ఎన్నిసార్లు మీరు అడిగినా నా దగ్గర ఒక్కటే ఆన్సర్ ఉంటుంది. బాబాయ్ వెనుకే మేము అందరం ఉంటాం అని చెర్రీ చెప్పినట్లు సమాచారం. ఇక చివరగా చరణ్ నోటి నుంచి జై జనసేన అని అనిపించేవరకు జన సైనికులు వదలేదట. ఏదిఏమైనా పవన్ వెంట మెగా ఫ్యామిలీ ఉంటుంది అని చెర్రీ దైర్యం ఇవ్వడంతో జన సైనికులు కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే ఎన్నికల్లో పవన్ తరపున ప్రచారానికి ఎవరు వస్తారు అనేది చూడాలి.
