హీరో అక్కినేని నాగ చైతన్య, డైరెక్టర్ వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో శ్రీనివాస చిట్టూరి మూవీ నిర్మించబోతున్నారనే ప్రకటన వచ్చిన దగ్గర నుండే అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగింది. విశేషం ఏమంటే వెంకట్ ప్రభుకు ఇదే తొలి తెలుగు సినిమా. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇటీవల పూజా కార్యక్రమంతో ప్రారంభమైయింది. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. దిగ్గజ సంగీత దర్శకులైన తండ్రీ కొడుకులు ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా ఈ మూవీకి సంగీతం అందించడం మరో విశేషం. వారిద్దరూ కలసి చేస్తున్న మొదటి సినిమా ఇదే! మంగళవారం అక్కినేని జయంతి సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన మరో అప్ డేట్ ను నిర్మాత శ్రీనివాస చిట్టూరి తెలిపారు.
ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను సెప్టెంబర్ 21 బుధవారం రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలు పెట్టబోతున్నట్టు తెలిపారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే కృతీశెట్టి బర్త్ డే కూడా బుధవారమే. ఈ సందర్భంగా నాగ చైతన్య సంబధించిన ఇంట్రస్టింగ్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇది అందరినీ సర్ ప్రైజ్ చేయడంతో పాటు మూవీపై ఆసక్తిని పెంచింది. నాగ చైతన్య అప్పిరియన్స్, లుక్ రివీల్ చేయకుండా పోస్టర్ డిజైన్ చేశారు. పోస్టర్‌లో నాగ చైతన్యపై కొన్ని టార్గెట్స్ వుండటం గమనించవచ్చు. పోస్టర్ రెడ్ అండ్ బ్లాక్ కలర్స్ లో పవర్ ఫుల్ వైబ్స్ ని కలిగివుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్ సమర్పిస్తున్నారు. స్టార్ రైటర్ అబ్బూరి రవి సంభాషణలు సమకూర్చుతున్నారు.