Ajay Devgan: గత కొంతకాలంగా బాలీవుడ్ లో సరైన హిట్ ఏదీ రాలేదు. దక్షిణాది సినిమాలతోనే బాలీవుడ్ కూడా నెట్టుకు వస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’, ‘కెజిఎఫ్ 2’, ‘పుష్ప’, ‘కాంతారా’ వంటి సినిమాల ఘన విజయాలు బాలీవుడ్ బడా స్టార్స్ గుండెల్లో రైళ్ళను పరిగెత్తించాయి. అప్పటికీ కొంతమంది బాలీవుడ్ సూపర్ స్టార్స్ దక్షిణాది సినిమాలను రీమేక్ చేసి హిట్ కోసం ప్రయత్నాలు చేశారు. అయినా సక్సెస్ వారి దరికి చేరలేదు. ఈ నేపథ్యంలో అజయ్ దేవగన్ దక్షిణాదిన హిట్ అయిన రెండు సినిమాలను హిందీలో రీమేక్ చేస్తున్నాడు. అవే ‘దృశ్యం, ఖైదీ’. వాటిలో ‘దృశ్యం’ రిలీజ్ కాగా… లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ‘ఖైదీ’ సినిమాను ‘భోలా’ పేరుతో తెరకెక్కిస్తూ స్వయంగా దర్శకత్వం కూడా చేస్తున్నాడు.
నిజానికి ఈ సినిమా రీమేక్ విషయంలో పలువురు వెనకడుగు వేశారు. కారణం లోకేశ్ డైరక్షన్ చేస్తేనే సరైన న్యాయం జరుగుతుందని భావించడమే. అందుకే కొందరు దర్శకనిర్మాతలు, హీరోలు ఈ సినిమా రీమేక్ చేయాలని అనుకుని కూడా వెనక్కి తగ్గారు. అయితే అజయ్ దేవగన్ మాత్రం వెరవకుండా ముందడుగు వేశాడు. అంతేకాదు ఈ సినిమా టీజర్ కూడా బుధవారం విడుదల అయింది. టీజర్‌కి చక్కటి స్పందన లభిస్తోంది. దీనికి కారణం ‘కెజిఎఫ్’ సినిమా ఫేమ్ రవి బస్రూర్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అని చెప్పవచ్చు. ఈ ఏడాది ఇప్పటికే ‘రన్‌వే 34’, ‘దృశ్యం 2’తో కొంతమేరకు ఆకట్టుకున్నాడు. వాటితో పాటు ‘ఆర్ఆర్ఆర్’, ‘గంగూబాయి కతియావాడి’లో అతిధి పాత్రలతో మెరిశాడు. ఇప్పుడు ‘భోలా’ టీజర్‌ను విడుదల చేశాడు. ఈ సినిమా మార్చి 2023లో విడుదల కానుంది. మరి ‘ఖైదీ’ రీమేక్‌తో అజయ్ దేవగన్ స్ట్రాంగ్‌గా బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూద్దాం.