మే 31 వైజాగ్ లో జరిగిన ‘బ్రహ్మాస్త్రం’ ప్రెస్ మీట్ సూపర్ హిట్ అయ్యింది. సాగరతీర వాసులు ‘బ్రహ్మస్త్రం’ హీరో రణబీర్ కపూర్, డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, దర్శక ధీరుడు రాజమౌళికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పబ్లిక్ ఇంటరాక్షన్ లో రణబీర్ కు సంబంధించిన ఓ విశేషాన్ని అక్కడి జనాలకు తెలియచేశాడు రాజమౌళి. హీరో రణబీర్ కపూర్ కథను అడగకుండా తన దగ్గరకు వచ్చే మనిషి ముఖం చూసి, ప్రాజెక్ట్ ను ఓకే చేస్తాడనే విషయం తన దృష్టికి వచ్చిందని, అందులో నిజమెంతో తెలుసుకోవాలని ఉందని అన్నాడు. రణబీర్ కపూర్ వేదిక మీదకు వచ్చిన తర్వాత అదే ప్రశ్నను అడిగాడు. అయితే అందులో ఎంత మాత్రం నిజం లేదని, ఇప్పటి వరకూ కథ తెలుసుకోకుండా తాను ఏ ప్రాజెక్ట్ అంగీకరించలేదని రణబీర్ స్పష్టం చేశాడు. ఇదే సమయంలో ఒకవేళ రాజమౌళి తన దగ్గరకు సినిమా చేస్తానని వస్తే, ఆయన ముఖం చూసి అంగీకరిస్తానని, కథ గురించి అస్సలు అడగనని రణబీర్ చెప్పడం విశేషం. ఇటు రణబీర్ కపూర్ అటు అయాన్ ముఖర్జీ ఇద్దరూ రాజమౌళిని, అతని ప్రతిభను ఆకాశానికి ఎత్తేశారు. ‘బ్రహ్మస్త’ మూవీకి సౌత్ లో రాజమౌళి ప్రెజెంటర్ గా వ్యవహరించడంతో దీని ఇమేజ్ అమాంతంగా పెరిగిపోయిందని అన్నారు.