Site icon NTV Telugu

Boss Party Song: భలేగా ‘వాల్తేరు వీరయ్య’ ‘బాస్ పార్టీ’!

Boss Party Song

Boss Party Song

Boss Party Song Released From Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘వాల్తేరు వీరయ్య’లోని “బాస్ పార్టీ” బుధవారం మధ్యాహ్నం 4.05 గంటలకు అలా వచ్చిందో లేదో ఇలా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. మైత్రీ మూవీస్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక తాజా పాటలోకి వెళ్తే, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఆరంభంలోనే “నువ్వు లుంగీ ఎత్కో… హెయ్… నువ్వు షర్ట్ ముడేస్కో… హెయ్…” అంటూ పాటలో హీరో కనిపించబోయే తీరును ముందుగానే వివరించడం విశేషం! ఆపై “బాసొస్తుండు… బాసొస్తుండు…” అంటూ హుషారు చేశారు డీఎస్పీ.

పక్కా మాస్ గెటప్‌లో చిరంజీవి “క్లబ్బుల్లోన పార్టీ అంటే షరా షరా మామూలే…” అంటూ డాన్స్ చేస్తూ కనిపిస్తారు. ఈ పాటలోనే “బాసూ… వేరీజ్ ద పార్టీ…”అంటూ ఊర్వశి రౌతేలా చిందేస్తూ కనువిందు చేస్తుంది. షూటింగ్ విజువల్స్‌తో పాటు మిక్స్ చేసి, ఈ పాటలో కొన్ని డాన్స్ బిట్స్‌ను అలా అలా కాసిన్ని చూపించారు. అదే ఫ్యాన్స్‌కు కిక్కునిస్తూండగా, చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ సైతం స్పా‌ట్‌కు వచ్చిన పిక్ ప్రత్యక్షం కావడం మరింతగా ఆకట్టుకుంటుంది. పాట చివరలో “డీజే వీరయ్య…” అంటూ చిరంజీవి నవ్వు వినిపిస్తుంది. ఇలాంటి అంశాలన్నీ అభిమానులను కిర్రెక్కించేలా ఉన్నాయి.

పాట మధ్య మధ్యలో కేకలు వేయడమే కాదు, ఈ పాటను పలికించిన రచయిత కూడా దేవిశ్రీ ప్రసాద్ కావడం విశేషం! డీఎస్పీతో పాటు నకాష్ ఆజిజ్, హరిప్రియ ఈ పాటలో గొంతు కలిపారు. శేఖర్ వీజే ఈ పాటకు నృత్యభంగిమలు రూపొందించారు. ఆర్థర్ ఎ. విల్సన్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా వ్యవహరించారు. పాట మొత్తం రాకపోయినా, మధ్య మధ్యలో చిరంజీవి చిందేసిన తీరు అభిమానులను కట్టిపడేస్తుందనే చెప్పాలి. పాట మాస్‌ను ఆకట్టుకొనే బాణీల్లో రూపొందింది. ‘వాల్తేరు వీరయ్య’కు ఈ పాట ఓ ఎస్సెట్ కాగలదని భావించవచ్చు.

Exit mobile version