ప్రముఖ నటి, బీజేపీ రాజ్యసభ సభ్యురాలు రూపా గంగూలీ కంట తడిపెట్టారు. మహాభారత్ హిందీ ధారావాహికలో ద్రౌపది పాత్రధారిణిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రూపా గంగూలీ పలు భాషా చిత్రాలలోనూ ఆ తర్వాత నటించారు. ప్రస్తుతం ఆమె బీజేపీ తరఫున రాజ్యసభ్యకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ లో జరిగిన భీర్భూమ్ విషాదాన్ని ప్రస్తావిస్తూ రూపా గంగూలీ రాజ్యసభలో భావోద్వేగానికి గురయ్యారు.
Read Also : KGF Chapter 2 : ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు హోస్ట్ గా టాప్ ప్రొడ్యూసర్
తృణముల్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పశ్చిమ బెంగాల్ లో అరాచక పాలన సాగుతోందని, అక్కడ హత్యలు చేసేవారికి ప్రభుత్వం కాపుకాస్తోందని, దాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని రూపా గంగూలి డిమాండ్ చేశారు. టీఎంసీ ప్రోత్సాహంతో భీర్బూమ్ లో సామూహిక హత్యాకాండ సాగుతోందని, ప్రజలు ఆ ప్రదేశం నుండి వలస వెళ్ళిపోతున్నారని, రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉండే వాతావరణం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన మరి కొందరు ఎంపీలు సైతం ఆమె వాదనతో ఏకీభవిస్తూ నినాదాలు చేశారు. అదే సమయంలో టీఎంసీ ఎంపీలూ వారికి వ్యతిరేకంగా కేకలు వేయడం మొదలు పెట్టారు. డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ పలు మార్లు విజ్ఞప్తి చేసినా ఇరు వర్గాలూ పట్టించుకోలేదు. దాంతో సభను పది నిమిషాల పాటు వాయిదా వేయాల్సి వచ్చింది.