’30 వెడ్స్ 21′ వెబ్ సీరిస్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మొదటి సీజన్ కు లభించిన ఆదరణతో ఇప్పుడు వారానికి ఒకటి చొప్పున సెకండ్ సీజన్ నూ స్ట్రీమింగ్ చేస్తున్నారు. అందులోని కథానాయకుడు చైతన్యరావ్ ఇప్పటికే కొన్ని సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించాడు. అలానే త్వరలో విడుదల కాబోతున్న ‘ముఖచిత్రం’లోనూ కీలక పాత్రను ధరించాడు. ఇదిలా ఉంటే చైతన్యరావ్ హీరోగానూ కొన్ని సినిమాలు ఇటీవల మొదలయ్యాయి. హెబ్బా పటేల్ నాయికగా, చైతన్యరావ్ హీరోగా ఓ మూవీ ఇప్పటికే సెట్స్ పై ఉంది. తాజాగా ‘పెళ్ళి చూపులు’ చిత్ర నిర్మాతలలో ఒకరైన యశ్ రంగినేని, చైతన్యరావ్ తో సినిమా నిర్మించబోతున్నారు. ‘డియర్ కామ్రేడ్, దొరసాని, ఏబీసీడీ’ చిత్రాల నిర్మాణంలోనూ యశ్ భాగస్వామిగా ఉన్నారు. ప్రస్తుతం కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా నటిస్తున్న ‘భాగ్ సాలే’ చిత్రానికీ ఆయన భాగస్వామి.
Read Also : Poonam Kaur : యూట్యూబర్లకు వార్నింగ్… చర్యలు తప్పవు !
చైతన్యరావ్ హీరోగా యశ్ రంగినేని తన బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై నిర్మించబోతున్న సినిమాకు చందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నారు. చందు గతంలో ‘ఓ పిట్టకథ’తో పాటు ‘మా వూరిలో ఓసారి ఏం జరిగిందంటే, ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ ‘ చిత్రాలను రూపొందించారు. ఇప్పుడీ కొత్త సినిమా థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ గా ఒక విల్లేజ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనుంది. అతి త్వరలోనే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమౌతుంది.
