బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యంగ్ గ్లోబల్ లీడర్స్ సమ్మిట్ 2025లో పాల్గొన్న తొలి భారతీయ నటిగా నిలిచారు. ప్రపంచంలోని వివిధ రంగాల నుండి మార్పు కోసం కృషి చేస్తున్న ప్రతిభావంతులు ఈ సమ్మిట్‌లో చేరి, భవిష్యత్ తరాలకు దారి చూపే ఆలోచనలు పంచుకున్నారు. సినిమాల్లో బలమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న భూమి, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలు వంటి రంగాల్లో తన కృషితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అది కూడా ఈ సమ్మిట్‌లో పాల్గొనడం ద్వారా భారతీయ సినీ రంగానికి కొత్త గౌరవాన్ని తీసుకువచ్చారు.
Also Read : Mirai : ‘మిరాయ్’ జర్నీ గురించి.. ఊహించని విషయాలు పంచుకున్న కార్తీక్ ఘట్టమనేని
ఈ సందర్భంగా భూమి తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ, “ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించే వేదికలో భాగమవడం గర్వంగా ఉంది. ఇది నాకు కొత్త ప్రేరణను ఇచ్చింది” అని తెలిపారు. భూమి తన సినీ కెరీర్‌లో మరో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నారు. త్వరలోనే ఆమె వెబ్ సిరీస్ ‘దల్దాల్’లో పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇకపై భూమి పెడ్నేకర్ కేవలం తెరపై నటి మాత్రమే కాదు, ప్రపంచ వేదికపై భారతీయ మహిళా శక్తి ప్రతీకగా నిలిచిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.