సంక్రాంతి బరిలో సందడి చేయడానికి ‘భీమ్లా నాయక్’ తహతహలాడుతున్నాడు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన భారీ బడ్జెట్, స్టార్ హీరో మూవీ ‘అఖండ’ ఘన విజయం సాధించడం, గ్రాండ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోవడంతో చిత్రసీమలోని అగ్ర నిర్మాతల్లో సరికొత్త జోష్ ను నింపినట్టయ్యింది. దాంతో తమ చిత్రాల ప్రచార హోరును, జోరును మరింతగా విస్తృతంగా, విస్తారంగా చేస్తున్నారు. అందులో భాగంగానే సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతున్న ‘భీమ్లా నాయక్’ లోని నాలుగవ గీతాన్ని విడుదల చేస్తున్నారు. నిజానికి ఈ పాటను నవంబర్ 30వ తేదీ విడుదల చేయాల్సింది. కానీ అదే రోజున ప్రముఖ సినీ గీత రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కన్నుమూయడంతో వాయిదా వేశారు. దానికి ఇప్పుడు ముహూర్తం ఖరారు చేశారు.
డిసెంబర్ 4వ తేదీ నాలుగో పాటను ఉదయం 10.08 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం తెలిపింది. ‘అడవి తల్లి మాట’ అనే ఈ గీతాన్ని ‘భీమ్లా నాయక్’ మూవీ ఎసెన్స్ అని మూవీ టీమ్ చెబుతోంది. ఇంతవరకూ విడుదలైన ఈ సినిమాలోని గీతాలు సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తున్నాడు. ముఖ్యంగా ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ ఇస్తున్న రీ-సౌండ్ అయితే అమోఘం, అద్భుతం. మరి ‘అడవి తల్లి మాట’ పాట ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది గంటలు వేచి చూడాల్సిందే! పవన్ కళ్యాణ్, రానా పాత్రలు ఢీ అంటే ఢీ అన్నట్టు సాగే ఈ చిత్రాన్ని సాగర్ చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు.
