Site icon NTV Telugu

‘భామ కలాపం’.. అందరికి నచ్చే కామెడీని వడ్డిస్తానంటున్న ప్రియమణి

bhama kalapam

bhama kalapam

ప్రముఖ ఓటిటీ సంస్థ ఆహా కొత్తకొత్త ప్రయోగాలకు సిద్దమవుతుంది. ప్రేక్షకులు కోరుకొనే అన్ని అంశాలను మేళవించి కొత్త కథలను ఎంచుకొని తన స్టామినాను పెంచుకొంటుంది. ఇప్పటికే టాక్ షోలు, సుకురవరం కొత్త సినిమాలతో మంచి జోష్ మీద ఉన్న ఆహా తాజాగా మరో కొత్త వెబ్ సిరీస్ తో రెడీ ఐపోయింది. సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రధానపాత్రలో ‘డియర్ కామ్రేడ్’ ఫేమ్ భరత్ కమ్మ నిర్మాణంలో ‘భామ కలాపం’ పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాకు అభిమన్యు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ కామెడీ థ్రిల్లర్ నుంచి రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు.

యూట్యూబ్ లో వంటల రెసిపీలు చేసే ఒక మహిళ అనుకోని విధంగా తనకు రాని, తెలియని వంటను చేయాల్సివస్తుంది. అప్పుడు తాను ఎదుర్కున్న సమస్యలు ఏంటి..? అస్సలు ఎందుకు ఆమె ఆ విధంగా చేయాల్సి వచ్చింది అనేది సస్పెన్స్ గా చూపించారు. అయితే ఇక్కడ ప్రియమణి ఒక పెద్ద కత్తి పట్టుకొని టెన్షన్ గా, భయంతో దేన్నో కట్ చేయడం చూపించారు కానీ.. అది ఏంటిది అనేది చూపించకుండా ఆసక్తిని రేకెత్తించారు. థ్రిల్లర్ అని చెప్పడంతో ప్రియమణి ఎవరినైనా హత్య చేసి దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుందా..? అని అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక గ్లింప్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉండడమే కాక సినిమా మీద అంచనాలు పెంచేసింది. ‘ప్రియమణి గారు ఏం వండుతున్నారో తెలియదు కానీ, మనకి మాత్రం ఒక మంచి కామెడీ థ్రిల్లర్‌ని వడ్డిస్తారు’ అంటూ ఆహా మేకర్స్ ప్రోమోతోనే ఆకట్టుకున్నారు. మరి త్వరలోనే ఈ ‘భామ కలాపం’ స్టోరీ ఏంటి అనేది తెలుసుకోవాల్సిందే.

Exit mobile version