రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత నటుడు పృథ్వీరాజ్.. మొదట్లో మంచి రోజులు చూశారు కానీ, ఆ తర్వాత అనూహ్యంగా ఎన్నో సమస్యల్లో చిక్కుకున్నారు. ఒకానొక సమయంలో.. అటు రాజకీయంగానూ, ఇటు సినిమాల పరంగానూ దాదాపు ఆయన కెరీర్ ముగిసిపోయిందన్న దుస్థితికి చేరుకున్నారు. అయితే.. తన తప్పుల్ని తెలుసుకున్న తర్వాత క్షమాపణలు చెప్పిన ఈయన ఇప్పుడు తిరిగి పుంజుకున్నారు. మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చిన పృథ్వీరాజ్.. ఓవైపు అవకాశాలు అందిపుచ్చుకుంటూ, మరోవైపు తప్పుల్ని సరిదిద్దుకుంటున్నారు. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. తన బ్యాడ్ ఫేజ్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాల్ని పంచుకుంటున్నారు.
తాజాగా ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన పృథ్వీ.. తాను ఈరోజు బతికి ఉండటానికి ఓ మహిళ కారణమని చెప్పుకొచ్చారు. 20 ఏళ్లుగా ఆమె తన బిడ్డలతో సమానంగా తనను ఆదరిస్తున్నారని, ఆర్థికంగానూ ఆదుకున్నారని చెప్పారు. కరోనా సమయంలో ఆమె తన దగ్గరే ఉన్నారని, అప్పుడు ఎన్నో పుకార్లు కూడా వచ్చాయన్నారు. వాటికి 2023లో సమాధానం చెప్తానని తెలిపారు. మొదట ఆ మహిళ పేరు వెల్లడించిన నిరాకరించిన పృథ్వీ.. ఆ తర్వాత ఆమె పేరును దాసరి పద్మరేఖగా వెల్లడించారు. తాను చెన్నైలో ఉన్నప్పటి నుంచి ఆమె తెలుసని, డ్యాన్సర్‌గా పని చేశారని అన్నారు. ఆ తర్వాత ఆమె హైదరాబాద్ వచ్చేశారన్నారు. తనకు వాళ్ల తాత కూడా తెలుసని, ఏ సమస్య వచ్చినా వాటిని సమిష్టిగా పరిష్కరించుకుంటామని, ప్రస్తుతం ఆవిడే తన బాగోగులు చూసుకుంటున్నారని పృథ్వీ వివరించారు.
తాను వైసీపీలో ఉన్న సమయంలో ఎవరెస్ట్ ఎక్కిన హిల్లరీ కంటే గొప్పవాడిననే ఫీలింగ్ తనకు కలిగిందని.. అప్పుడు తన స్థాయిని మర్చిపోయి ఎంతోమందిని ఎన్నో మాటలు అన్నానని పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా.. వాళ్లందరూ తనను అర్థం చేసుకున్నారని, లేకపోతే ఇండస్ట్రీ నుంచి పృథ్వీ కనుమరుగై మూడేళ్లు అయ్యుండేదని పేర్కొన్నారు. 2020 నుంచి తనకు కష్టాలు ప్రారంభమయ్యాయని, తనను పలకరించిన వాళ్లూ దూరమయ్యారని పృథ్వీ చెప్పుకొచ్చాడు.
