Bandla Ganesh: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఏం జరుగుతుందో ఎవరికి అర్ధం కాకుండా ఉంది. ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి షూటింగ్లు బంద్ చేసి మరీ ఆలోచిస్తామని ప్రొడ్యూసర్ గిల్డ్ నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆగస్టు 2 నుంచి షూటింగ్లు బంద్ కానున్నవి. అయితే ఈ నిర్ణయంపై పలువురు విమర్శిస్తున్నారు. ఇటీవల సీతారామం ప్రెస్ మీట్ లో నిర్మాత అశ్వినీ దత్ ఈ నిర్ణయాన్ని ఖండించారు. ఒకప్పుడు సినిమా టికెట్స్ పెంచమని అడిగినవారు.. ఇప్పుడు తగ్గించమని అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్లే షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. చిత్ర పరిశ్రమలో ఏదైనా జరిగితే చూడడానికి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉండగా.. కొత్తగా ఈ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఎందుకు వచ్చిందో అర్ధం కావడం లేదంటూ ఘాటుగా స్పందించారు. ఇక ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. తాజాగా అశ్వినీ దత్ వ్యాఖ్యలకు తాను పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు తెలిపాడు నిర్మాత, నటుడు బండ్ల గణేష్. ఒక టీవీ ఛానెల్ లైవ్ లో ఫోన్ లో మాట్లాడిన ఆయన.. హీరోలు దేవుళ్ళని, వారిని మంచిగా చూసుకొంటేనే సినిమాలు బాగా ఆడతాయని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా హీరోలను రెమ్యూనిరేషన్ తగ్గించుకోమనే హక్కు ఎవరికి లేదని, ఒకప్పుడు ఉన్న సీనియర్ హీరోలను ఏ నిర్మాతైనా ఎలా అడిగాడా..? అని ప్రశ్నించారు.
“అశ్వినీ దత్ వ్యాఖ్యలకు నేను పూర్తిగా మద్దతు తెలుపుతున్నాను. ఏ హీరోను, డైరెక్టర్ ను పారితోషికం తగ్గించుకోవాలి అని అడిగే హక్కు ఎవరికి లేదు. వారి మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని సినిమా చేయమని అడిగినప్పుడు.. వారు ఎంత పారితోషికం అడిగితె అంతే ఇవ్వాలి. మార్కెట్ లో చాలా కార్లు ఉంటాయి. ఒక్కో కారుకు ఒక్కో రేట్ ఉంటుంది. దేని రేంజ్ దానిదే. హీరోలు కూడా అంతే. కాల్ షీట్లకు.. షీట్లకు తేడా తెలియని వాళ్లు కూడా ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు. ఏ రోజు ఏ లైట్స్ వాడుతురో.. ఏ లోకేషన్ కు ఎంత ఖర్చు అవుతుందో తెలియని వాళ్లు సినిమాలు తీస్తున్నారు. నేను నటుడిగా ప్రొడక్షన్ మేనేజర్ గా ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో పనిచేశాను. నా సినిమా హిట్ అవ్వడం కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఈ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇవన్నీ వేస్ట్.. ఒక ఛాంబర్ – కౌన్సిల్ ఉన్నాయి.. దానికి ఎప్పుడు కట్టుబడి ఉండాలి.
సినిమాలు తీయని వాళ్లు కూడా గిల్డ్ లో ఉన్నారు.. వాళ్లకు సినిమా అంటే ఏం తెలుసు. సినిమా అంటే ఒక ప్రేమ, ఆప్యాయత, అనురాగం.. బిడ్డను ప్రేమించినట్లు తమ సినిమాను ప్రేమించాలి. గిల్డ్ అంట గిల్డ్.. ఎందుకండి గిల్డ్.. టైమ్ వేస్ట్ యవ్వారాలు ఇవన్నీ.. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, చిరంజీవి, కృష్ణంరాజు కంటే గొప్పోళ్లా వీళ్ళు.. వాళ్లు ఎప్పుడైనా వచ్చి మేము ప్లాపుల్లో ఉన్నాం మాతో వచ్చి ఒక సినిమా చేయండి అని నిర్మాతలను అడిగారా..? హీరోలు అంటే దేవుళ్ళు.. హీరోలను ప్రేమించండి.. సినిమా సూపర్ హిట్ వస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బండ్లన్న మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై ప్రొడ్యూసర్ గిల్డ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.