కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ‘అఖండ 2: తాండవం’ సినిమాను వీక్షించి, చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ‘అఖండ 2: తాండవం’ స్పెషల్ షోని వీక్షించారు. సినిమా వీక్షించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రం కేవలం వినోదం మాత్రమే కాదని, ప్రతి భారతీయుడు, ముఖ్యంగా ప్రతి హిందువు వెన్నెముకను తట్టి లేపే అద్భుత సందేశమని కొనియాడారు. ధర్మ మార్గం తప్పిన వారికి, సనాతన ధర్మంపై అవగాహన లేని వారికి ఈ సినిమా ఒక గొప్ప పాఠంలా నిలుస్తుంది. దేశ సరిహద్దులను సైనికులు కాపాడుతుంటే, దేశం లోపల ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజానిదేనని ఆయన గుర్తుచేశారు. అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటం కూడా తప్పేనని ఈ సినిమా చాటిచెప్పింది. సమాజానికి మేలు చేసే అంశాలను కమర్షియల్ హంగులతో జోడించి తీయడంలో బోయపాటి శ్రీను సిద్ధహస్తుడని, పరమేశ్వరుడి అనుగ్రహంతోనే ఆయన ఇలాంటి సంచలన చిత్రాలను తీస్తున్నారని ప్రశంసించారు.
Also Read :Jagapathi Babu: జిత్తు టు అప్పలసూరి: జగ్గుభాయ్ విశ్వరూపం చూపిన రోల్స్ ఇవే
“సనాతన ధర్మాన్ని రక్షించే యోధుడు నరేంద్ర మోదీ ఈ దేశాన్ని పాలిస్తున్నారు కాబట్టే, కరోనా వంటి విపత్కర సమయంలో మనం ధైర్యంగా నిలబడగలిగాం. శాస్త్రవేత్తలను ప్రోత్సహించి, ప్రపంచానికే వ్యాక్సిన్ అందించిన ఘనత మోదీ ప్రభుత్వానిదే.” హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్‌ను మోదీ స్వయంగా సందర్శించిన విషయాన్ని గుర్తు చేస్తూ, దేశ సంస్కృతిని కాపాడే నాయకత్వం ఉంటేనే జాతి గర్వంగా తల ఎత్తుకుంటుందని ఆయన అన్నారు. నందమురి బాలకృష్ణ నటన గురించి మాట్లాడుతూ.. “తెరపై బాలయ్యను చూస్తుంటే సాక్షాత్తు ఆ శివుడే దిగివచ్చినట్లు ఉంది. ఎన్టీఆర్ గారి రూపం ఆయనలో కనిపిస్తోంది. యువత, విద్యార్థులు ఈ సినిమా కోసం చూపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే ధర్మం పట్ల వారికి ఉన్న గౌరవం అర్థమవుతోంది” అని బండి సంజయ్ పేర్కొన్నారు. హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని, తప్పుడు ప్రచారాలు నమ్మేవారంతా ఇప్పటికైనా ‘హిందూ ధర్మం’ అనే గొడుగు కిందకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ‘అఖండ 2’ వంటి సినిమాలు భవిష్యత్తులో మరిన్ని రావాలని, అప్పుడే మన సంస్కృతి, సంప్రదాయాలు పదికాలాల పాటు పదిలంగా ఉంటాయని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కాసం వెంకటేశ్వర్లు, ఎన్వీ సుభాష్, జె.సంగప్ప, ఉమా మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
