నందమూరి నటసింహం బాలయ్య నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘నరసింహ నాయుడు’. బీగోపాల్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. డాన్స్ మాస్టర్ గా, ఫ్యాక్షన్ లీడర్ నరసింహ నాయుడుగా బాలయ్య ఇచ్చిన పెర్ఫార్మెన్స్ కి మాస్ థియేటర్స్ పూనకాలతో ఊగిపోయాయి. 2001 సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం ఆరు కోట్ల బడ్జట్ తో తెరకెక్కి 30 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ని రాబట్టింది. ఫస్ట్ హాఫ్ లో బాలయ్యని డాన్స్ మాస్టర్ గా చూపిస్తూ సినిమాని ఓపెన్ చేసినా ఇంటర్వెల్ బిట్ లో ‘వాడు డాన్స్ మాస్టర్ కాదు నరసింహ నాయుడు’ అనే డైలాగ్ పడడంతో థియేటర్స్ టాప్ లేచిపోయాయి. ‘కత్తులతో కాదు రా కంటి చూపుతో చంపేస్తా’ అనే డైలాగ్ ఈరోజుకీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంది. ఈ సినిమాకి మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పించే రేంజులో ఉంటుంది. ఆడియన్స్ నరసింహ నాయుడు సీన్ ని పెట్టి ఆడియో మ్యూట్ చేసినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సహా డైలాగ్స్ ని చెప్పగలరు అంటే బాలయ్య-బీగోపాల్-మణిశర్మ చేసిన మ్యాజిక్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.
ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు హీరోయిన్స్ తో బాలయ్య రోమన్స్ చేసాడు. నిన్నా కుట్టేసినాది, లక్స్ పాప, చిలకపచ్చ కొక, కో కో కోమలి సాంగ్స్ నరసింహ నాయుడు సినిమాకే హైలైట్ గా నిలిచాయి. కేవలం సాంగ్స్ కోసం అప్పట్లో స్పెషల్ షోస్ వేసే వారు. మృగరాజు, దేవి పుత్రుడు సినిమాలకి పోటీగా రిలీజ్ అయ్యి, ఆ రెండు సినిమాలకి షాక్ ఇచ్చిన నరసింహ నాయుడు సినిమా దాదాపు 22 ఏళ్ల తర్వాత రీరిలీజ్ అవ్వడానికి రెడీ అవుతోంది. జూన్ 10న బాలయ్య బర్త్ డే సందర్భంగా నరసింహ నాయుడు సినిమా రీరిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. చెన్నకేశవ రెడ్డి సినిమా రీరిలీజ్ అయినప్పుడు నందమూరి అభిమానులు హల్చల్ చేసారు. ఇప్పుడు చిన్నకేశవ రెడ్డి సినిమాని మించిన మూవీ వస్తోంది మరి ఫాన్స్ ఏం చేస్తారో చూడాలి.