Site icon NTV Telugu

Avatar 2 Trailer: అదరహో.. ‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’ ట్రైలర్

Avatar 2 Y

Avatar 2 Y

విఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన ‘అవతార్’ సినిమా విడుదలై పుష్కర కాలం దాటినా, ఆ సినిమాపై ఇప్పటికీ ఎంతో క్రేజ్ ఉందని తెలిసిపోతోంది. ‘అవతార్’కు సీక్వెల్ గా రూపొందిన ‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’ సినిమా ట్రైలర్ ను శుక్రవారం విడుదలయిన మార్వెల్ కామిక్స్ – సూపర్ హీరో మూవీ ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్’ సినిమాతో పాటు ప్రదర్శించారు. ‘డాక్టర్…’ మూవీ ఆరంభంలోనే ప్రదర్శించిన ‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’ ట్రైలర్ రెండు నిమిషాల సమయంతో రూపొందింది. ‘డాక్టర్…’ సినిమా త్రీడీ లో ప్రదర్శితమైన థియేటర్లలో ‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’ ట్రైలర్ ను కూడా త్రీడీలోనే రూపొందించడంతో ప్రేక్షకుల థ్రిల్ ఫీలయ్యారు. యానిమేటెడ్ కేరెక్టర్స్ తో రూపొందినప్పటికీ తెరపై ‘అవతార్-2’ ట్రైలర్ ను చూడగానే ప్రేక్షకులు కేరింతలు కొట్టడం విశేషం!

భూలోకంలో లాగే జీవమున్న పండోరా గ్రహంలోని ప్రకృతి వనరులను మానవుల మనుగడ కోసం కొల్లగొట్టాలని చూస్తారు. అందుకోసం ప్రత్యేక సంస్థనే నెలకొల్పి, పండోరాకు మన వాళ్ళను పంపుతూ ఉంటారు. పండోరా వారి మనుగడకు మనవల్ల అపకారం జరగనుందని తెలిసిన కథానాయకుడు ఆ గ్రహవాసుల తరపున పోరాడతాడు. అక్కడి అమ్మాయి ప్రేమలో పడతాడు. వారిద్దరూ సహజీవనం సాగించడం, వారికి ఓ పిల్లాడు కూడా ఉన్నట్టు ‘అవతార్’ పార్ట్ -2 ట్రైలర్ లో కనిపిస్తుంది. పండోరాపై మానవులు చేసే దాడుల కారణంగా అక్కడి జలవనరులకు కూడా అపాయం కలిగే పరిస్థితి ఏర్పడుతుంది. జాక్ సెల్లీ, నెయత్రీ తమ పండోరా వాసులను కాపాడుకోవడం కోసం నీటిని ఆధారం చేసుకొని యుద్ధం చేసే విజువల్స్ కనువిందు చేస్తాయి. తొలి భాగంలోనే మానవులపై దాడి చేసే సమయంలో మన భారతీయ పురాణాల్లో లాగా పక్షులపై విహరిస్తూ బాణాలతో పండోరావాసులు దాడి చేయడం మన మనసులు ఆకట్టుకుంది. ఈ సారి వస్తోన్న ‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’లో నీటనుంచి పక్షులపై అధిరోహించి పండోరావాసులు చేసే దాడి భలేగా అలరిస్తోంది. చిత్రమేమంటే, పండోరాకు వెళ్ళిన సల్లీ అక్కడి వారిలాగే నీలం రంగులోకి మారతాడు. ఇందులో పండోరా జనం అంతా నీలం రంగులో కనిపించినా, సల్లీ, నెయత్రీ పుత్రుడు ఎరుపురంగులో దర్శనమివ్వడం విశేషం! ఏది ఏమైనా ‘అవతార్-2’ ట్రైలర్ ముందుగా థియేటర్లలో ప్రదర్శితమై తన ప్రత్యేకత చాటుకుంటోంది. దీనిని చూడాలంటే తప్పకుండా ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్’ సినిమాను తిలకించవలసిందే! విశేషమేమంటే, ‘అవతార్-2’ పై అభిమానంతో ట్రైలర్ కోసం వెడితే ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్’ కూడా ఆకట్టుకుంటూ ఉండడం విశేషం! ‘అవతార్-2’ ట్రైలర్ తోనే ఇంత క్రేజ్ సృష్టించిన ఈ సినిమా డిసెంబర్ 16న జనం ముందుకు వచ్చాక ఇంకెంతలా సందడి చేస్తుందో చూడాలి!

Exit mobile version