ఆగస్ట్ 20వ తేదీ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ థియేటర్స్ అసోసియేషన్ లో కొందరు చేసిన ఆరోపణలను యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీవ్రంగా ఖండించింది. కొవిడ్ కారణంగా సినిమా రంగంలోని అన్ని విభాగాలు ఇబ్బందులు పడుతున్నాయని, ఈ సమయంలో అంతా కలిసి మెలిసి ముందుకు సాగాల్సింది పోయి… ఓ వ్యక్తిని, ఓ నిర్మాతను టార్గెట్ చేస్తూ విమర్శించడం సరికాదని తెలిపింది. ఇలా వ్యక్తులను, నిర్మాతలను ఏ ఒక్క శాఖ విమర్శించినా ఊపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. నిర్మాతలకు తన చిత్రాలను ఎలా విడుదల చేయాలి, ఎవరి ద్వారా విడుదల చేయాలి అనే విషయంలో పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, దాన్ని కొందరు నియంత్రించాలను కోవడం సమంజసం, సమర్థనీయం కాదని గిల్డ్ తెలిపింది. ఒక ఆర్టిస్ట్ ను వేరొక సెక్టార్ టార్గెట్ చేయడం వల్ల ఆరోగ్యకరమైన వాతావరణం కలుషితమైపోతుందని, ఇలాంటి చర్యలకు ఎవరూ పాల్పడకూడదని హితవు పలికింది.
గతంలో ఎగ్జిబిటర్స్ తో పలు సమస్యల విషయమై తాము సంప్రదింపులు జరిపామని, అప్పుడు వాటికి వారు ప్రాధాన్యం ఇవ్వలేదని, ఇప్పుడు కూడా ఎగ్జిబిటర్స్ పెద్ద సినిమాలకు ఇచ్చే ప్రాధాన్యం మీడియం, స్మాల్ బడ్జెట్ చిత్రాలకు ఇవ్వడం లేదని అలాంటప్పుడు నిర్మాతలు వేరే ఆదాయ మార్గాలను ఎంచుకోవడంలో తప్పులేదని గిల్డ్ అభిప్రాయపడింది. ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ కలిసి ముందుకు సాగాల్సిన ఈ సమయంలో ఇలా కొందరిని టార్గెట్ చేయడం సరైనది కాదని, ఆ రోజున కొందరు ఎగ్జిబిటర్స్ చేసిన విమర్శలను ఖండిస్తున్నామని ఈ లేఖలో పేర్కొంది. చిత్రం ఏమంటే…. నిజానికి మీడియా సమావేశం జరిగిన మర్నాడే… తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కొందరు సభ్యులు చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ, ఎవరి మనసునైనా నొప్పించి ఉంటే క్షమించమని కోరింది. అయినా ఇప్పుడీ ఖండన రావడంతో మరి వారు ఎలా స్పందిస్తారో చూడాలి.
