NTV Telugu Site icon

అభిరుచి గల దర్శకులు.. కె. ప్రత్యగాత్మ!

ఎందరో రచయితలు దర్శకులుగా రాణించి అలరించారు. వారిలో కె. ప్రత్యగాత్మ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అనేక జనరంజకమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన కె.ప్రత్యగాత్మ, హిందీలో కె.పి.ఆత్మగానూ కొన్ని చిత్రాలు రూపొందించారు. తెలుగులో జయలలిత నటించిన తొలి చిత్రం, చివరి చిత్రం రెండూ ప్రత్యగాత్మ దర్శకత్వంలోనే రూపొందడం విశేషం! కుటుంబ కథా చిత్రాల దర్శకునిగా పేరొందిన ప్రత్యగాత్మ చివరి వరకూ అదే తీరున సాగారు.

ప్రత్యగాత్మ ఇంటిపేరు కొల్లి. కానీ, ఆయన తండ్రి పేరు కోటయ్య వర్మ. అందువల్ల కొందరు కోటయ్య ప్రత్యగాత్మ అనీ పిలిచేవారు. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని ముదునూరులో 1925 అక్టోబర్ 31న ప్రత్యగాత్మ జన్మించారు. బాల్యం నుంచీ అభ్యుదయ భావాలతో సాగారు. కొన్నాళ్ళు కమ్యూనిస్ట్ ఉద్యమంలో పాలుపంచుకొని అండర్ గ్రౌండ్ లోనూ ఉన్నారు. ఆ ఉద్యమంలోనే అన్నపూర్ణ పరిచయం అయ్యారు. వారిద్దరూ పెళ్ళాడారు. కొంతకాలం ‘ఉదయని’ పత్రికలో వ్యాసాలు రాశారు. జర్నలిస్ట్ గానూ పనిచేశారు. మద్రాసు చేరుకుని, అక్కడ తాతినేని ప్రకాశరావు వద్ద కథారచయితగా, అసోసియేట్ గా పనిచేశారు. తొలుత ‘నిరుపేదలు’ చిత్రానికి కథ సమకూర్చారు. ఆ తరువాత ‘ఇల్లరికం’ చిత్రం కూడా ఆయన కథతోనే తెరకెక్కింది. అదే సినిమాకు సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా పనిచేశారు. దాంతో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత ఎ.వి.సుబ్బారావు ‘భార్యాభర్తలు’ చిత్రంతో ప్రత్యగాత్మను దర్శకునిగా పరిచయం చేశారు. ఏయన్నార్, కృష్ణకుమారి జంటగా నటించిన ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ యేడాది ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రజత పతకం గెలుచుకుంది. తరువాత ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ లోనే వరుసగా ఏయన్నార్ తో ‘కులగోత్రాలు’, ‘పునర్జన్మ’ వంటి చిత్రాలు తెరకెక్కించి అలరించారు. ఈ సంస్థ నిర్మించిన ‘మనుషులు-మమతలు’తోనే జయలలిత తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. అందులో ఆమె స్విమ్ షూట్ ధరించడంతో ఆ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చారు. తెలుగులో తొలి ‘ఏ’ సర్టిఫికెట్ చిత్రంగా ‘మనుషులు-మమతలు’ నిలచింది.

యన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘మంచి మనసు’, ‘దీక్ష’ చిత్రాలకూ కె.ప్రత్యగాత్మ దర్శకత్వం వహించారు. ఈ రెండు చిత్రాలలోనూ జమున నాయిక కావడం విశేషం. కృష్ణంరాజును తన ‘చిలకా-గోరింకా’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేశారు ప్రత్యగాత్మ. ఇదే సినిమాతో రమాప్రభను నటిగా నిలిపారు. ఏయన్నార్ రజతోత్సవ చిత్రంగా తెరకెక్కిన ‘ఆదర్శకుటుంబం’కు కూడా ప్రత్యగాత్మ దర్శకుడు. విశాఖ పట్నంలో చిత్రీకరణ జరుపుకున్న తొలి చిత్రంగా ప్రత్యగాత్మ ‘కులగోత్రాలు’ నిలచింది. ఏ.ఏ.కంబైన్స్ పతాకంపై ఏయన్నార్ సమర్పణలో కృష్ణంరాజు హీరోగా రూపొందిన ‘మంచిమనసు’ కూడా ప్రత్యగాత్మ నిర్దేశకత్వంలోనే రూపొందింది. ఆయన దర్శకత్వంలో రూపొందిన “అమ్మకోసం, శ్రీమంతుడు, పల్లెటూరి బావ, ముగ్గురమ్మాయిలు, అల్లుడొచ్చాడు, అత్తవారిల్లు, గడుసు అమ్మాయి, కమలమ్మ కమతం” వంటి చిత్రాలు అలరించాయి.

కె.పి.ఆత్మ పేరుతో హిందీలో “దో లడ్కియా, మెహమాన్, ఏక్ నారీ ఏక్ బ్రహ్మచారి, బచ్ పన్, తమన్నా, రాజా ఔర్ రంక్, ఛోటా భాయి” వంటి హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో కొన్ని సిల్వర్ జూబ్లీ చూడడం విశేషం. ప్రముఖ దర్శకనిర్మాత కె.హేమాంబరధర రావు, ప్రత్యగాత్మకు సోదరుడే. ప్రత్యగాత్మ తనయుడు కె.వాసు కూడా దర్శకనిర్మాతగా సాగారు. ప్రత్యగాత్మ దర్శకత్వంలో రూపొందిన చివరి చిత్రం ‘నాయకుడు -వినాయకుడు’ కూడా ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపైనే తెరకెక్కడం విశేషం. ఈ చిత్రం జయలలిత చివరి తెలుగు సినిమా కావడం మరింత విశేషం! తరువాత ప్రత్యగాత్మ సినిమాలకు దూరంగా జరిగారు. 2001 జూన్ 8న ప్రత్యగాత్మ తుదిశ్వాస విడిచారు.