Site icon NTV Telugu

Ashok Galla: ‘మురారి’ రీమేక్ చేయాలని ఉంది!

Galla Ashok

Galla Ashok

ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘హీరో’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా! ఏప్రిల్ 5న 30వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అశోక్ మీడియాతో తన కొత్త సినిమా విశేషాలను పంచుకున్నాడు. ముందుగా ‘హీరో’ ఇచ్చిన అనుభవాన్ని తలుచుకుంటూ, ”దాదాపు రెండేళ్ళ పాటు ఆ ప్రాజెక్ట్ కోసం పనిచేశాం. మొత్తానికి సంక్రాంతికి విడుదల చేసి, ఊపిరి పీల్చుకున్నాం. థియేటర్లో విడుదలైనప్పుడే కాదు ఆ తర్వాత ఓటీటీలో వచ్చినప్పుడూ చక్కని స్పందన లభించింది. అయితే సంక్రాంతికి ఉండాల్సిన కలెక్షన్లు లేవనే బాధ అయితే ఉంది” అని చెప్పారు. కరోనా ఆ సమయంలో పీక్స్ లో ఉండటంతో తమ సినిమా వసూళ్ల మీద కొంత ప్రభావం పడిందని అన్నారు. ఏడవ తరగతి నుండి తాను సింగపూర్ లోనే చదువుకున్నానని అక్కడ వెస్ట్రన్ డ్రామాస్ బాగా వేయించేవారని, అలా నటనలో అనుభవం చిన్నప్పటి నుండే వచ్చిందని, నిజానికి తనకు ఇంటెన్స్ క్యారెక్టర్స్, సెటిల్డ్ యాక్టింగ్ చేయడం ఇష్టమని అశోక్ గల్లా చెప్పారు.

సెకండ్ మూవీ కోసం కథలు వినడం మొదలు పెట్టానని, రెండు మూడు ఆసక్తికరమైన స్క్రిప్ట్స్ తన దగ్గరకు వచ్చాయని, అందులో ఒకదాన్ని ఫైనలైజ్ చేసి జూన్ లో షూటింగ్ మొదలు పెడతామని, ఇదే యేడాదిలో దాన్ని విడుదల చేస్తామని అశోక్ అన్నారు. ఓ నటుడిగా పేరు తెచ్చుకోవాలన్నదే తన అభిమతమని, ప్రత్యేకంగా ఒక జానర్ కు పరిమితం కావడం ఇష్టం లేదని, మంచి స్క్రిప్ట్ వస్తే వెబ్ సీరిస్ చేయడానికైనా తాను సిద్ధమని చెప్పారు. ఇప్పుడు తెలుగులో పాన్ ఇండియా కల్చర్ బాగా పెరిగిందని, కానీ తను మాత్రం ముందు తెలుగు వారి మనసుల్ని గెలుచుకోవాలని అనుకుంటున్నానని, ఆ తర్వాతే పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గురించి ఆలోచిస్తానని తెలిపారు. మహేశ్ బాబు సినిమాలు చూసి పెరిగిన తనపై ఆయన ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని, ఒకవేళ మహేశ్ సినిమాను రీమేక్ చేయాల్సి వస్తే తన ఛాయిస్ ‘మురారి’ అని, అలాంటి యూనిక్ సబ్జెక్ట్ ఏ హీరోకైనా దొరకడం కష్టమని అశోక్ అభిప్రాయపడ్డారు.

ఆ రాత్రి ఏం జరిగిందంటే..

ఏప్రిల్ 2వ తేదీ రాత్రి రాడిసన్ బ్లూ హోటల్ లోని పబ్ లో జరిగిన రేవ్ పార్టీలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలు పాల్గొన్నారు. వారందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో గల్లా అశోక్ కూడా ఉన్నాడనే వార్తలు 3వ తేదీ ఉదయమంతా మీడియాలో హల్చల్ చేశాయి. అయితే ఆ తర్వాత కొంత సేపటికి ఆ వార్తలను గల్లా కుటుంబ సభ్యులు ఖండించారు. అశోక్ ఆ పార్టీకి వెళ్ళలేదని వివరణ ఇచ్చారు. ఈ విషయం గురించి అశోక్ మాట్లాడుతూ, ”రెండవ తేదీ రాత్రి నేను ఫిజియోధెరపీ చేయించుకుని ఇంటికెళ్ళి హాయిగా పడుకున్నాను. తెల్లవారి లేచి ఫోన్ చూసుకుంటే… మీడియాలో ఆ పార్టీకి నేను వెళ్ళినట్టు వార్తలు కనిపించారు. ఈ వ్యవహారంలోకి నా పేరును ఎందుకు లాగారో తెలియదు. బహుశా సెలబ్రిటీ అన్న కారణంగా నా పేరుకు అంత ప్రాధాన్యం ఇచ్చి ఉండొచ్చు. సోషల్ మీడియాలో నా పేరు విపరీతంగా వైరల్ కావడంతో ఇప్పుడు నేను ‘హీరో’ననే భావన కలిగింది” అని అన్నారు. మీడియా సమావేశానంతరం తన తల్లి పద్మావతితో కలిసి అశోక్ బర్త్ డే కేక్ కట్ చేశారు.

Exit mobile version