Arundhati: ఇప్పుడంటే.. మైథలాజికల్ సినిమాలు అని, పౌరాణిక సినిమాలు, హర్రర్ సినిమాలు అని.. కొత్త టెక్నాలిజీతో విజువల్స్ చూపించి భయపెడుతున్నారు కానీ, అప్పట్లో అరుంధతి సినిమా చూసి.. దాదాపు ఎంతోమంది రెండు రోజులు నిద్రకూడా పోలేదు అంటే అతిశయోక్తి కాదు. ఇక సంక్రాంతికి ఇప్పుడు అంతా హనుమాన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇలాగే సంక్రాంతికి రిలీజ్ అయ్యి.. సెన్సేషనల్ హిట్ అందుకున్న అరుంధతి నేటికి 15 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా అరుంధతి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుకుందాం.
లేడీ సూపర్ స్టార్ అనుష్క ప్రధాన పాత్రలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాను శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడినట్లు ఎన్నోసార్లు తెలిపారు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే రోజూ జనవరి 16, 2009లో విడుదలై, తెలుగు సినిమా చరిత్రలో ఎన్నటికీ చెరగని ముద్ర వేసింది. అసలు ఈ కథ ఎలా మొదలయ్యింది అంటే.. ఒక పార్టీలో నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి బంధువు పదే పదే గద్వాల్ కోట గురించి మాట్లాడుతండగా ఆయనకు ఆసక్తికరంగా అనిపించిందట. ఇక ఆ కోట గురించి తెలుసుకొని.. దానిపై ఒక సినిమా తీయాలని అనుకున్నారట. ఇక ఈ కోటకు.. చిన్నప్పుడు తన తాత చెప్పిన కథలోని ఒక లైన్ తీసుకొని యాడ్ చేయాలనుకున్నారు. కోటలో రాజకుమారి పనివాడితో ఉండగా చూసిన రాజు ఇద్దరినీ చంపేసి అదే గదిలో వారిని సమాధి చేశాడు.. ఇదే కథ గద్వాల్ కోటలో జరిగితే.. ఈ ఒక్క ఆలోచనే అరుంధతి తీయడానికి మూలం. ఆ తరవాత దర్శకుడు కోడి రామకృష్ణను పిలిచి కథను డెవలప్ చేశారు.
ఇక అదే సమయంలో హీరోయిన్ గా ఎవరు బావుంటారు అనుకుంటుండగా.. అనుష్క పేరు వినిపించింది. ఈ సినిమాకు ముందు స్వీటీ.. విక్రమార్కుడు,లక్ష్యం, డాన్ లాంటి మంచి విజయాలను అందుకుంది. అరుంధతిగా ఆమె బాగా సెట్ అవుతుంది అనుకున్నారట. అలా అరుంధతి మొదలయ్యింది. ఇక అనుష్క తరువాత అంతటి పవర్ ఫుల్ క్యారెక్టర్ అంటే సోనూసూద్ మాత్రమే. పశుపతిగా సోనుసూద్ నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పాలి. సోనూసూద్ కు సాయి కుమార్ అన్న రవి శంకర్ డబ్బింగ్ చెప్పారు. ఇక పాడనా ప్రళయ కీర్తనా సాంగ్ కోసం అనుష్క ఎంతో కష్టపడి డ్యాన్స్ నేర్చుకుంది. ఈ సినిమా తరువాత అనుష్క, సోనూసూద్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఇక 2009 సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ.70 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు నందులను అరుంధతి సొంతం చేసుకుంది. సాంగ్స్, విజువల్స్, మ్యూజిక్.. మొత్తం ఈ సీనియాకు హైలైట్ గా నిలిచాయి. అమ్మాళీ.. ఎంత బొమ్మాళీ..డైలాగ్ అయితే ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినపడుతూనే ఉంది. ఇప్పుడు.. డైరెక్టర్ కోడి రామకృష్ణ ఈ లోకంలో లేకపోయినా.. ఆయన సినిమాలతో ఇంకా జీవించే ఉన్నారు అని చెప్పొచ్చు. ఈ సినిమా వచ్చి 15 ఏళ్లు అయినా కూడా పశుపతి భయం పోలేదు అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
