నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘అంటే సుందరానికీ…’ మూవీ ఈ నెల 10వ తేదీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో గ్రాండ్ వే లో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో 8వ తేదీ హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ప్లాన్ చేసి, భారీ స్థాయిలో దానిని నిర్వహించాలని నిర్మాతలు భావించారు. దానికి ఒక రోజు ముందు పవన్ కళ్యాణ్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా హాజరు కావడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అది కాస్త 8వ తేదీ నుండి 9వ తేదీకి మారింది. నాని మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ ఎందుకు హాజరవుతున్నాడు? ఆ వేదికపై పవన్ ఏం మాట్లాడతాడు? అనేది ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ రేట్లను తగ్గించిన నేపథ్యంలో ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన పవన్ కళ్యాణ్ ఆ వేదికపై నుండి చేసిన వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదమయ్యాయో అందరికీ తెలిసిందే. పవన్ వ్యాఖ్యలకూ తమకు సంబంధం లేదని చివరికు తెలుగు సినిమా రంగానికి చెందిన ఫిల్మ్ ఛాంబర్ వంటి సంస్థలు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అలానే ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ రేట్లను తగ్గించడంపై కినుక వహించి హీరో నాని చేసిన కామెంట్స్ కూడా అప్పట్లో అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అయ్యింది. ఇప్పుడు వీరిద్దరూ ఒకే వేదికపై రేపు మాట్లాడబోతున్నారు. సో… సహజంగానే ఎలాంటి మాటలు వీరి నోటి నుండి వస్తాయి? అవి ఎంత వివాదాస్పదం అవుతాయి? అనే దానిపైనే అందరి దృష్టీ ఉంది.
‘అంటే సుందరానికీ….’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నాని ఏపీలో ప్రస్తుతం ఉన్న టిక్కెట్ రేట్ల గురించి తన అభిప్రాయాన్ని చెప్పాడు. గతంలో తాను ఆ విషయమై వ్యాఖ్యానించినప్పుడు వాటి ధర మరీ తక్కువ ఉందని, అయితే ఇప్పుడు పరిస్థితులు మారి, ప్రభుత్వం కూడా టిక్కెట్ రేట్లను పెంచిందని అన్నాడు. నిజానికి తనకు సినిమా తప్పితే రాజకీయాలు తెలియవని, ఆ నేపథ్యంలోనే చిత్రపరిశ్రమలోని ఇబ్బందులు గురించి తన మనసుకు తట్టింది అప్పట్లో చెప్పానని వివరణ ఇచ్చాడు. టిక్కెట్ రేట్లకు సంబంధించిన వివాదం సద్దుమణుగుతోందని అంతా అనుకుంటున్న టైమ్ లో ఇప్పుడీ వేడుకకు నిర్మాతలు పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించడం, అతను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మరోసారి సినిమా రంగ పెద్దలు ఉలిక్కి పడ్డారు. ఎందుకంటే… ఆ మధ్య సినిమా టిక్కెట్ రేట్లు పెంచమంటూ చిరంజీవి ఏపీ సీఎం జగన్ ను ప్రాధేయపడటాన్ని కూడా పవన్ కళ్యాణ్ తప్పు పట్టాడు. ఒకరిని దేహీ అని అడగడం ఏమిటని, ఇది కరెక్ట్ కాదని ఖండించాడు. అటువంటి పవన్ కళ్యాణ్ రేపు నాని మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మళ్ళీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడనే గ్యారంటీ లేదు! పైగా సినిమా టిక్కెట్ రేట్లు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పిన జగన్ ప్రభుత్వం, ఆ తర్వాత వాటిని బాగా పెంచింది. అంతేకాదు… ‘ట్రిపుల్ ఆర్’కి మాత్రమే కాకుండా ఇతర భారీ బడ్జెట్ చిత్రాలకూ టిక్కెట్ ధరలు అదనంగా పెంచుకునే వెసులు బాటు కల్పించింది. సో… ప్రభుత్వ నిర్ణయంపై ఏదో ఒక విమర్శ పవన్ కళ్యాణ్ చేయకుండా ఉండడనిపిస్తోంది. మొత్తం మీద ‘అంటే సుందరానికీ…’ ప్రీ రిలీజ్ వేదికపై పవన్ ఏం మాట్లాడతాడు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.