మలయాళ నటుడు, నిర్మాత విజయ్ బాబుపై మరోసారి లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. గతంలో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఇటీవలే ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక తాజాగా మరో మలయాళ హీరోయిన్, విజయ్ బాబుపై ఆరోపణ చేయడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. విజయ్ బాబు, తనను ఎంతలా వేధించాడో తెలుపుతూ సోషల్ మీడియాలో ఏకరువు పెడుతూ పోస్ట్ పెట్టింది. ” నటుడు, నిర్మాత, ఫ్రైడే ఫిలిం హౌస్ యజమాని విజయ్‌బాబును 2021 నవంబర్‌లో ఒకసారి కలిశాను. అది కూడా ప్రొఫెషనల్ గానే కలిశాను. పని గురించి మాట్లాడుకున్నాం.. ఆ తరువాత నా పర్సనల్ విషయాలను అడిగాడు. నా బాధలు చెప్పాను. అప్పుడే మందు తాగుతూ నన్ను తాగమని బలవంతపెట్టాడు. నేను వద్దు అని చెప్పాను. వెంటనే నా పర్మిషన్ లేకుండా బలవంతంగా నా పెదాలపై ముద్దుపెట్టాడు.
అతడు చేసిన పనికి షాకైన నేను క్షణాల్లో దూరం జరిగాను. ఇంకో ముద్దు పెడతా దగ్గరకు రమ్మని పిలిచాడు. నేను ససేమిరా కుదరదని చెప్పడంతో నాకు సారీ చెప్పి.. ఈ విషయాన్ని ఎవరితో చెప్పవద్దని బతిమిలాడాడు. నేను కూడా సరేనని చెప్పి బయటికి వచ్చేశాను. ఆ తరువాత అతని చీప్ బిహేవియర్ నన్ను ఇండస్ట్రీలోకి రానివ్వకుండా చేసింది. మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలన్న నా కలను అక్కడితోనే తుడిచేశాను. హీరోయిన్ అవ్వాల్సిన నేను.. ఆ భయంతో ఇదుగో ఇలా ఉంటున్నాను. మొన్నామధ్య ఓ నటి తనకు జరిగిన చేదు అనుభవాన్ని బయటపెట్టిన వార్తను చదివినప్పుడు నేను కూడా ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పాలనిపించింది. నా బాధను కూడా అందరితో పంచుకోవాలనిపించింది. అందుకే ఇప్పడూ నోరువిప్పాను” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారాయి.