Site icon NTV Telugu

Sitha Ramam: నిర్మాతగా మరో జన్మ ఎత్తినట్టుంది: అశ్వినీదత్

Sita Ramam

Sita Ramam

ప్రముఖ నిర్మాత చలసాని అశ్వినీదత్… తమ తాజా చిత్రం ‘సీతారామం’కు ప్రేక్షకుల నుండి లభిస్తున్న విశేష ఆదరణ పట్ల హర్షాతిరేకం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే… నిర్మాతగా మరో జన్మ ఎత్తినట్టుగా ఉందంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అతి త్వరలో తమ సంస్థ 50వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సమయంలో తనను, తన పిల్లలను ప్రోత్సహిస్తున్న సినీ ప్రేమికులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రేమకథా చిత్రం నిర్మించాలనే తన చిరకాల కోరిక ‘సీతారామం’తో తీరిందని, దీనిని తమ ఆల్ టైమ్ క్లాసిక్స్ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి, శుభలగ్నం, ఇంద్ర, పెళ్ళి సందడి, మహానటి’ చిత్రాల జాబితాలో చేర్చడం ఆనందంగా ఉందన్నారు. అలానే ఈ సినిమాకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే… ‘శంకరాభరణం’, ‘ప్రతిఘటన’ నాటి ప్రకంపనాలు గుర్తొస్తున్నాయని చెప్పారు. కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా తమిళ, కన్నడ, కేరళ ప్రేక్షకులు సైతం ‘సీతారామం’కు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. రెండేళ్ళ పాటు ఈ ప్రాజెక్ట్ ను తన కుమార్తె స్వప్న ఒంటి చేత్తో నడిపిందని, అందుకు ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు తెలియచేస్తున్నానని చెప్పారు. ఈ శుభ సందర్భంలో ప్రేక్షకులకు శిరసు వంచి నమస్కరిస్తూ, నటీనటులు, సాంకేతిక నిపుణులకు పేరుపేరునా అభినందించడం తన కర్తవ్యంగా భావిస్తున్నాని అశ్వినీదత్ అన్నారు. ‘సీతారామం’ మూవీ మొదటి ఆట నుండి క్లాసికల్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకోవడంతో పాటు, రోజు రోజుకూ కలెక్షన్లను పెంచుకుంటూ విజయపథంలో సాగుతోంది.

 

Exit mobile version