పాలిటిక్స్, సినిమా, క్రికెట్, స్పోర్ట్స్- వీటి చుట్టూ పలు కొత్త పదాలు వెలుగు చూస్తూ ఉంటాయి. ఈ నాలుగు అంశాలలో చోటు చేసుకున్న కరెంట్ టాపిక్స్ కు అనుగుణంగా ‘అమూల్’ సంస్థ తమ ప్రచార పర్వంలో పదాలతో పదనిసలు పలికిస్తూ ఉంటుంది. హాలీవుడ్ జంట జానీ డెప్, అంబర్ హెర్డ్ విడిపోయి, నాలుగేళ్ళు దాటింది. అయితే ఓ టీవీ ప్రోగ్రామ్ లో జానీ డెప్ తో ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో, అతను తనను మానసికంగా, భౌతికంగా ఎంతలా వేధించాడో అంబర్ హెర్డ్ తెలిపింది. అందులో ఏ మాత్రం నిజం లేదని, హెర్డ్ వ్యాఖ్యలు తన ఇమేజ్ కు భంగం కలిగించాయంటూ జానీ డెప్ ఆమెపై 50 మిలియన్ల అమెరికన్ డాలర్లు (మన కరెన్సీలో రూ. 375 కోట్లు) పరువు నష్టం దావా వేశాడు. ఈ కేసు ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తి కలిగించింది. ఈ కేసుపై వాదోపవాదాలు కూడా భలేగా సాగాయి. మే 27వ తేదీన చివరి వాదోపవాదాలు వినిపించాల్సి ఉంది.
జానీ డెప్, అంబర్ హెర్డ్ అభిమానులు ఎవరికివారు తమ అభిమానతార ఈ కేసులో విజయం సాధించాలని ఆశిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. కొందరు జానీకి , మరికొందరు అంబర్ కు మద్దుతు పలుకుతున్నారు. ఈ ఆసక్తిని గమనించిన ‘అమూల్’ సంస్థ, ఎప్పటిలాగే తనదైన రీతిలో ఓ యాడ్ ను తయారు చేసింది. అందులో జానీ డెప్, అంబర్ హెర్డ్ ను పోలిన రెండు బొమ్మలను పక్కపక్కనే కూర్చుని కంప్యూటర్స్ చూస్తున్నట్టు కార్టూన్ గీయించింది. పైన ‘టూ మచ్ సీన్ అండ్ హెర్డ్’ (చాలా చూశాము, విన్నాము) అని, అదే బొమ్మ కింద ‘డెప్ యువర్ నైఫ్ ఇన్’ (ఇతరులకు ఇబ్బంది కలిగించావు) అని ఉంది. పై క్యాప్షన్ లో ‘హెర్డ్’ పేరు, కింది క్యాప్షన్ లో ‘డెప్’ పేరు వచ్చేలా మాటలతో గారడి చేసిన ‘అమూల్’ సంస్థను, ఆ యాడ్ క్రియేట్ చేసిన వారిని జనం అభినందించకుండా ఉండలేకపోతున్నారు. మరి మే 27న డెప్, హెర్డ్ – ఇద్దరిలో ఎవరికి అనుకూలంగా తీర్పు వస్తుందో చూడాలి. అప్పుడు ‘అమూల్’ ఏ తరహా కార్టూన్ తో ప్రత్యక్షమవుతుందో కూడా ఆసక్తి కలిగిస్తోన్న అంశమే!