‘అజరామరం’ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలచిన కొన్ని కళాఖండాలు ఉన్నాయి. తెలుగు చిత్రసీమలో ‘అజరామర చిత్రం’ అంటే 1963లో రూపొందిన ‘లవకుశ’ తరువాతే ఏదైనా అనేవారు ఎందరో ఉన్నారు. తెలుగువారి తొలి రంగుల చిత్రంగా తెరకెక్కిన ‘లవకుశ’ 1963 మార్చి 29న విడుదలయింది. నభూతో నభవిష్యత్ అనదగ్గ విజయం సాధించింది. అరవై ఏళ్ళవుతూ ఉన్నా, ఆ సినిమాను అధిగమించిన మరో పౌరాణికం మనకు కానరాదు. అలాగే ఆ చిత్రం దక్షిణాదిన కోటి రూపాయలు వసూలు చేసిన తొలిచిత్రంగా చరిత్ర సృష్టించింది. అరవై ఏళ్ళ నాటి ఈ వసూళ్ళను ఇప్పటి లెక్కలతో సవరిస్తే కనీసం రెండు వేల కోట్ల రూపాయలు అని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. అంటే ఇప్పటి వెయ్యికోట్ల సినిమాల కంటే మిన్న అన్నమాట! పైగా ఈ చిత్రం వసూళ్ళు దక్షిణాదికే పరిమితం. ఇప్పటిలా ప్రపంచవ్యాప్తంగా దక్షిణాది సినిమాలు విడుదలయ్యే రోజులు కావవి! ఇక ‘లవకుశ’లోని పాత్రల కోసమే ఆ యా నటీనటులు జన్మించారా అనిపిస్తుంది. సంగీతసాహిత్యాలు జోడుగుర్రాల్లా సాగాయి. మరపురాని మరచిపోలేని పద్యాలు, పాటలతో తెలుగువారిని ‘లవకుశ’అలరించింది. ప్రముఖ దర్శకులు సి.పుల్లయ్య, ఆయన తనయుడు సి.యస్.రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లలితాశివజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఏ.శంకరరెడ్డి నిర్మించారు.
వాల్మీకి రామాయణం శ్రీరామపట్టాభిషేకంతో సంపూర్ణమవుతుంది. తదుపరి ‘ఉత్తర రామాయణం’గా భవభూతి రాసిన నాటకం ప్రసిద్ధం కాగా, ఆ పై పలు గాథలు వెలుగు చూశాయి.’ఉత్తర రామాయణం’లోని సీతారాముల సంతానం లవకుశుల వీరగాథను పలు భాషల్లో పలు విధాలా శ్లాఘించారు. వాటిని ఆధారం చేసుకొని ఈ కథ రూపొందింది.
ఉత్తర రామాయణగాథ!
శ్రీరామపట్టాభిషేకం తరువాత రాముడు జనరంజకంగా పాలన చేస్తానని తన ప్రజలకు వాగ్దానం చేస్తాడు. తన పాలనలో ప్రజలు ఏలాంటి కష్టాల పాలు కారాదని నిర్ణయించి, రామచంద్రుడు వేగులను నియమిస్తాడు. తనపైనా, తన పాలనపైనా ప్రశంసలు కాదు, విమర్శలు ఉన్నా వినిపించాలనీ చెబుతాడు రాముడు.అది ఎంతటి కష్టతరమైనదైనా సరే తనకు విన్నవించాలనీ వేగులకు సూచిస్తాడు. సీతారాముల సంసారం సుఖంగా సాగుతూ ఉంటుంది. సీతమ్మ గర్భవతి. ఆ సమయంలో రామాయణగాథను వివరించే చిత్రపటాలను చూస్తుంది. మళ్ళీ వనాలకు ఏగి ఆ ప్రశాంతవాతావరణంలో సేదతీరాలని భావిస్తుంది. ఆ విషయాన్ని శ్రీరామునికీ చెబుతుంది సీత. రాజ్యంలో ఓ రజకుడు తన భార్యను అనుమానించి, ఆమెను విడనాడ నిర్ణయిస్తాడు. ఎందరు చెప్పినా వినని అతడు “ఆయన యెర్రి రామచంద్రుడు కనుక ఏడాది లంకలో ఉన్నసీతను తెచ్చి ఏలుకున్నాడు… ఊళ్ళోవాళ్ళందరినీ అలాగే ఏలుకోమంటాడా?” అంటూ ప్రశ్నిస్తాడు. ఈ విషయం విన్న ఓ వేగు వచ్చి, రామునికి విన్నవిస్తాడు. ఆ మాట విని చలించిపోతాడు శ్రీరాముడు.సీత మళ్ళీ వనాలకు వెళ్ళాలన్న అభిలాషను నెరవేరుస్తూ, లక్ష్మణుడిని ఆమెను వనాల్లో వదలి రమ్మంటాడు రాముడు. తమ్ముళ్ళు వారించినా, రాజారామునిగా అది తన శాసనం అని చెబుతాడు. వనంలో సీతను విడిచి, అసలు విషయం వివరిస్తాడు లక్ష్మణుడు. తన స్వామి ఆజ్ఞాపిస్తే అగ్నిలో దూకడానికీ సందేహించని తాను, ఆయన శాసిస్తే దానిని పాటించనా, ఆ విషయం తనతో ఎందుకు చెప్పలేదని విలపిస్తుంది సీత. తరువాత ఆ వనాల్లో ఆమెను చూసిన వాల్మీకి తన ఆశ్రమానికి తీసుకుపోవడం,అక్కడే సీతమ్మ కవలపిల్లలను ప్రసవించడం జరుగుతాయి. ఆ కవలలకు లవకుశులని పేర్లు. వారిద్దరూ వాల్మీకి వద్ద రామాయణం నేర్చి పాడుతూ సాగుతుంటారు. అయోధ్యకు పోయి తమ పాటలతో రాముని సైతం మెప్పిస్తారు.అయితే అక్కడ సీతమ్మ లేదని తెలుసుకొని, రాముడే ఆమెను వనాలకు పంపాడని ద్వేషిస్తారు. రామరాజ్యంలో కాటకం వస్తుంది. నివారణగా కాంచనసీతాసమేతుడై అశ్వమేధయాగం ఆరంభిస్తాడు రాముడు. యాగాశ్వం కానలకు పోయి, వాల్మీకి ఆశ్రమ ప్రాంతం చేరుతుంది. అదే సమయంలో సీతాదేవి లలితాదేవి వ్రతం ఆరంభిస్తుంది. ఆమె పూజకోసం పూలకు కుశుడు వెళతాడు. అప్పుడు యాగాశ్వాన్ని బంధిస్తాడు లవుడు. శత్రుఘ్నుని బాణాలకు లవుడు మూర్ఛపోతాడు. ఇది తెలిసిన కుశుడు వచ్చి, యుద్ధం చేసి శత్రుఘ్నుని ఓడించి, యాగాశ్వాన్ని బంధిస్తాడు. లక్ష్మణుడు వచ్చి, అతనూ లవకుశుల చేతిలో ఓడిపోతాడు. దాంతో రఘురాముడే బయలుదేరతాడు. ఆయనతో ఆంజనేయుడు వెళతాడు. అక్కడ రామనామం జపం చేస్తూ హనుమంతుడు ఆశ్రమం ప్రవేశిస్తాడు. శ్రీరామలవకుశుల యుద్ధం సాగుతుంది. ఆశ్రమంలో పూజచేస్తున్న సీతమ్మను చూసి, హనుమ విషయం వివరిస్తాడు. సీతమ్మ పూజ ఆపి, పరుగున వచ్చి తండ్రిపై ఆయుధాలు ప్రయోగిస్తున్న బిడ్డలను వారిస్తుంది. చివరకు తమ కన్నతల్లే సీతమ్మ అని, శ్రీరాముడే తమ జనకుడనీ తెలుసుకుంటారు. లవకుశులను శ్రీరామునికి అప్పగించి, తల్లిభూదేవి గర్భంలోకి వెళుతుంది సీతమ్మ. లవకుశుల పట్టాభిషేకం చేసి, శ్రీరాముడు అవతారం చాలించి,వైకుంఠంలో శ్రీమహావిష్ణువులో లీనమవ్వడంతో కథ ముగుస్తుంది.
శ్రీరామపాత్రలో యన్.టి.రామారావు, సీతమ్మగా అంజలీదేవి జీవించిన ఈ చిత్రంలో లవునిగా నాగరాజు, కుశునిగా సుబ్రహ్మణ్యం, వాల్మీకిగా చిత్తూరు నాగయ్య, లక్ష్మణునిగా కాంతారావు నటించారు. మిగిలిన పాత్రల్లో శోభన్ బాబు, సత్యనారాయణ, ధూళిపాల, శివరామ్, రేలంగి, రమణారెడ్డి, కేవీయస్ శర్మ,శాండో కృష్ణ, కన్నాంబ, యస్.వరలక్ష్మి, సూర్యకాంతం, గిరిజ, సంధ్య, లక్ష్మీప్రభ, జయంతి, వాసంతి తదితరులు అభినయించారు. ఈ చిత్రానికి సదాశివబ్రహ్మం రచన చేశారు.
మరపురాని సంగీతసాహిత్యాలు!
“జయ జయ రామా…”, “రామన్న రాముడు కోదండరాముడు…”, “విరిసె చల్లని వెన్నెల…”, “ముద్దుమోము…”, “వల్లనోరి మామా నీ పిల్లని…”, “ఏ నిమిషానికి ఏమి జరుగునో…”, “జగదభిరాముడు…”, “రామకథను వినరయ్యా…”, “వినుడు వినుడు రామాయణగాథ…”, “శ్రీరాముని చరితమును…”, “ఎందుకే నామీద కోపం…”, “ఊరకే కన్నీరు నింపిన కారణమేమమ్మా…”, “శ్రీరామ సుగుణధామా…”, “సందేహించకుమమ్మా…”, “అశ్వమేధయాగానికి జయము…”, “లేరు కుశలవుల సాటి…”, “శ్రీరామ పరంధామా…” అంటూ సాగే మొత్తం 17 పాటలు, పద్యాలు, శ్లోకాలు కలిపి మరో 21 వెరసి 38 గానాలు ఈ చిత్రరాజంలో చోటు చేసుకున్నాయి. సముద్రాల సీనియర్, సదాశివబ్రహ్మం, కొసరాజు పాటలు పలికించగా, కొన్ని పద్యాలను సముద్రాల, మరికొన్నిటిని సదాశివబ్రహ్మం రాశారు. కంకంటి పాపరాజు, దువ్వూరి రామిరెడ్డి రాసిన బహుప్రాచుర్యం పొందిన పద్యాలను అనువుగా ఇందులో చొప్పించారు. ఘంటసాల స్వరకల్పన చేశారు. ఇందులోని అన్ని పద్యాలు, పాటలను కంఠస్థం చేసి అలరించిన వారెందరో ఉన్నారు. ఇప్పటికీ ఈ చిత్రంలోని పద్యాలు, పాటలను సాధన చేస్తూ భావి గాయనీగాయకులు సాగుతూ ఉండడం విశేషం!
‘లవకుశ’చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. యన్టీఆర్, అంజలీదేవి, నాగయ్య, సంధ్య, శివరామ్ వంటివారు రెండు భాషల్లోనూ నటించారు. తెలుగులో లక్ష్మణునిగా కాంతారావు నటించగా, తమిళంలో ఆ పాత్రను జెమినీగణేశన్ పోషించారు. రేలంగి పాత్రను ఎమ్.ఆర్.రాధ ధరించగా, గిరిజ పాత్రలో మనోరమ కనిపించారు. ఈ చిత్రానికి రవికాంత్ నగయిచ్ ట్రిక్ ఫోటోగ్రఫి ఆ రోజుల్లో జనాన్ని భలేగా అలరించింది.
యన్టీఆర్ తమ్ముళ్ళు ఇద్దరు గణేశన్ లు!
‘లవకుశ’కు ముందు యన్టీఆర్ తొలిసారి శ్రీరామునిగా తెరపై కనిపించిన చిత్రం ‘చరణదాసి’. ‘లవకుశ’ నిర్మాత శంకర్ రెడ్డే ఆ సినిమానూ నిర్మించారు. ఆ చిత్రం తమిళంలో ‘మాతర్ కుల మాణిక్యం’ పేరుతో రూపొందింది. అందులో యన్టీఆర్ పాత్రను పోషించిన జెమినీగణేశన్ ‘లవకుశ’లో శ్రీరాముని తమ్ముడు లక్ష్మణునిగా నటించడం విశేషం!చరణదాసి’లో ఓ డ్రీమ్ సీక్వెన్స్ లో రామునిగా నటించిన యన్టీఆర్ తరువాత పూర్తిస్థాయిలో శ్రీరామునిగా కనిపించిన చిత్రం తమిళంలో తెరకెక్కిన ‘సంపూర్ణ రామాయణం’. అందులో శ్రీరాముని తమ్ముడు భరతుని పాత్రలో మరో మహానటుడు శివాజీగణేశన్ నటించారు. అలా శివాజీగణేశన్, జెమినీగణేశన్ ఇద్దరూ యన్టీఆర్ కు తమ్ముళ్ళుగా నటించిన చిత్రాలు రామాయణగాథతో తెరకెక్కడం తమిళనాట ఈ నాటికీ సినీవిశ్లేషకులు విశేషంగా చెప్పుకుంటారు.
జైత్రయాత్ర!
తెలుగునాట మొదట 26 ప్రింట్లతో విడుదలైన ‘లవకుశ’ అన్ని కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. లేట్ రిలీజ్ లో మరో 36 కేంద్రాలలో వందరోజులు ప్రదర్శితమైంది. వెరసి 62 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న చిత్రంగా దాదాపు మూడున్నర దశాబ్దాలు చెక్కుచెదరకుండా నిలచింది. ఈ నాటికీ అన్ని కేంద్రాలలో శతదినోత్సవం చూసిన ఏకైక పౌరాణిక చిత్రంగా ‘లవకుశ’ నిలచే ఉంది. ‘లవకుశ’ చిత్రం 18 కేంద్రాలలో రజతోత్సవం, మూడు కేంద్రాలలో ద్విశతదినోత్సవం చూసింది. హైదరాబాద్ లో అరవై వారాలు ప్రదర్శితమై, తెలుగునాట తొలి ‘వజ్రోత్సవ’ చిత్రంగా నిలచింది. భారతదేశం అంతటా విడుదలై విజయఢంకా మోగించిన ‘కిస్మత్’, ‘మొఘల్ ఏ ఆజమ్’ వంటి చిత్రాలు కోటి రూపాయలు చూశాయి. ఆ తరువాత కోటి రూపాయలు వసూలు చేసిన చిత్రంగా ‘లవకుశ’ నిలచింది. కేవలం దక్షిణాదిలోనే ‘లవకుశ’, ‘మొఘల్ ఏ ఆజమ్’ కంటే తక్కువ రోజుల్లో కోటి రూపాయలు మూటకట్టడాన్ని అప్పట్లో సినీపండితులు సంభ్రమాశ్చర్యాలతో చర్చించుకున్నారు.అలా కోటి చూసిన తొలి దక్షిణాది చిత్రంగా ‘లవకుశ’ చరిత్రలో నిలచింది. 23 రీళ్ళతో రూపొందిన ‘లవకుశ’ చిత్రం తెలుగునాట ప్రదర్శనలో రికార్డులు సృష్టించింది. రిపీట్ రన్స్ లోనూ ఈ సినిమా శతదినోత్సవాలు, రజతోత్సవాలు చూడడం విశేషం. ఇంతటి ఘనవిజయం సాధించిన పౌరాణిక చిత్రం మరొకటి లేదనే చెప్పాలి.
దక్షిణాదిన రంగుల చిత్రాల రూపకల్పన మొదలైన తొలి రోజుల్లోనే ‘లవకుశ’ చిత్రం కూడా మొదలయింది. అయితే నిర్మాత శంకర రెడ్డి ఈ చిత్ర రూపకల్పనలో పలు పాట్లు పడ్డారు. అందువల్ల ‘లవకుశ’ చిత్ర నిర్మాణంలో ఆరేళ్ళ జాప్యం జరిగింది. అందువల్లే ఈ సినిమాలో లవకుశులుగా నటించిన నాగరాజు, సుబ్రహ్మణ్యం కొన్నిసీన్స్ లో పెద్గగా, మరికొన్ని సన్నివేశాల్లో చిన్నగా కనిపిస్తారు. అయితే సినిమా ఘనవిజయం సాధించడంతో ఆ తేడాను ఎవరూ అంతగా పట్టించుకోలేదు. తరువాతి రోజుల్లోనూ ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే ‘లవకుశ’కు జేజేలు పలికారు జనం. నేడు మేటి ఎడిటర్ గా సాగుతున్న శ్రీకర్ ప్రసాద్ తండ్రి ఏ.సంజీవి (ఎల్.వి.ప్రసాద్ కు సోదరులు) ‘లవకుశ’కు ఎడిటర్ గా పనిచేయడం విశేషం.
స్ఫూర్తి!
ఇదే ఉత్తర రామాయణ ఆధారంగా ప్రప్రమథంగా సి.పుల్లయ్య దర్శకత్వంలోనే 1934లో ‘లవకుశ’ చిత్రం రూపొందింది. తెలుగు చిత్రసీమలో భారీవసూళ్ళు చూసిన మొదటి చిత్రంగా ఆ ‘లవకుశ’ను పేర్కొంటారు. దాదాపు 29 సంవత్సరాల తరువాత అదే గాథను సి.పుల్లయ్య రూపొందించడం విశేషం! ఈ సినిమా షూటింగ్ మధ్యలో అంతరాయం కలగడం, మళ్ళీ షూటింగ్ మొదలు కావడం జరిగింది. అందువల్ల కొన్ని సన్నివేశాలను పుల్లయ్య తనయుడు సి.యస్.రావు తెరకెక్కించారు. అందుకే ఈ చిత్రానికి ఇద్దరి పేర్లు దర్శకత్వం వహించినట్టు పేర్కొన్నారు. తరువాత ఒరియాలో ఇదే ఇతివృత్తంతో ‘సీతాలవకుశ’ పేరుతో ఓ చిత్రం రూపొందింది. అందులో హీరో తరుణ్ తల్లిదండ్రులు రోజారమణి, చక్రపాణి సీతారాములుగా నటించారు. ఒరియాలో ఆ సినిమా సైతం మంచి విజయం సాధించింది. అదే విధంగా తెలుగులో యన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణ శ్రీరాముని పాత్రలో బాపు-రమణ ‘శ్రీరామరాజ్యం’ చిత్రాన్ని2011లో రూపొందించారు. ఇళయరాజా బాణీల్లో ఈ సినిమా కూడా ఆకట్టుకుంది. యన్టీఆర్ నటవంశంలో మూడోతరం కథానాయకునిగా అలరిస్తోన్న జూనియర్ యన్టీఆర్ ‘జై లవకుశ’ పేరుతో త్రిపాత్రాభినయం చేస్తూ ఓ సాంఘిక చిత్రంలో నటించారు. ఆ సినిమా సైతం ప్రేక్షకాదరణ పొందింది. ఇలా ‘లవకుశ’ టైటిల్, ఆ ఉత్తర రామాయణగాథ ప్రేక్షకులను పలుమార్లు మెప్పించింది.