Dare Devil: అజిత్ ‘డేర్ డెవిల్‌’ నుంచి తప్పుకున్న మోహన్‌లాల్.. సెప్టెంబర్ నుంచి షూటింగ్

Dare Devil (2)

Dare Devil (2)

Dare Devil: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తర్వాత దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తో మరోసారి చేతులు కలిపిన అజిత్ కుమార్ కొత్త మూవీ ‘డేర్ డెవిల్’ ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. చాలాకాలంగా AK64 పేరుతో ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు షూటింగ్ దశలోకి అడుగుపెడుతోందనే వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ చివరి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అజిత్ కుమార్ ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరులో ‘డేర్ డెవిల్’ రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొననున్నారు. మొదట ఈ సినిమా 2026 ఫిబ్రవరిలోనే సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉన్నప్పటికీ, నిర్మాత ఖరారు కాకపోవడంతో ప్రాజెక్ట్ ఆలస్యమైందని సమాచారం. ఇప్పుడు ఈ చిత్రాన్ని అజిత్ భార్య షాలినీ అజిత్ కుమార్ తన కొత్త బ్యానర్ బ్రేవ్‌హార్ట్స్ ప్రొడక్షన్పై నిర్మించనున్నన్నారు.

ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం మోహన్‌లాల్ పేరు. తొలుత ఈ సినిమాలో ఆయన కీలక పాత్రలో నటిస్తారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం పారితోషికానికి సంబంధించిన కారణాల వల్ల మోహన్‌లాల్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాలేదని తెలుస్తోంది.  ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ అనిరుధ్ రవిచందర్ సంగీతం. ‘వేదాలం’, ‘వివేగం’, ‘విడాముయర్చి’ తర్వాత అజిత్‌తో ఆయన మరోసారి కలిసి పనిచేయడం అభిమానుల్లో అంచనాలను మరింత పెంచుతోంది. అధిక్ రవిచంద్రన్ కూడా ఈ మూవీని గుడ్ బ్యాడ్ అగ్లీ తరహా యాక్షన్ డ్రామా కాకుండా, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నట్లు  ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. కథలో చాలా సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయని కూడా సమాచారం.

అజిత్ చివరిసారిగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ‘గుడ్ బ్యాడ్’ అగ్లీలో కనిపించారు. ఆ చిత్రంలో రెడ్ డ్రాగన్‌గా పేరొందిన మాజీ గ్యాంగ్‌స్టర్ ఏకే పాత్రలో ఆయన నటనకు మంచి స్పందన లభించింది. త్రిష కృష్ణన్, అర్జున్ దాస్, సునీల్, జాకీ ష్రాఫ్ తదితరులు నటించిన ఆ సినిమా తర్వాత వస్తున్న ‘డేర్ డెవిల్‌’పై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం షూటింగ్ తేదీలు, నటీనటుల పూర్తి వివరాలు, మోహన్‌లాల్ అంశం వంటి విషయాలు ఆఫీషియల్ గా బయటికి రాలేదు. అయినప్పటికీ సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభమవుతుందనే ప్రచారం కోలీవుడ్‌లో ‘డేర్ డెవిల్’ చుట్టూ ఉత్సాహాన్ని మరింత పెంచుతోంది.