జీవితం ఏమిటి? వెలుతురు… చీకటి… అన్నారు పెద్దలు. రజనీకాంత్ వంటి సూపర్ స్టార్ కూతురుగా ఐశ్వర్య రజనీకాంత్ చూడని వెలుగులు లేవు. ధనుష్ తో పెళ్ళయ్యాక కూడా ఐశ్వర్య జీవనం భలేగా సాగింది. ధనుష్ తో విడాకులు తీసుకున్న తరువాత చీకటి ఆవరించింది. అయితే మళ్ళీ ఐశ్వర్య తనదైన పంథాలో సాగాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆమె రూపకల్పనలో తెరకెక్కిన “సంచారి” అనే పాట నెట్ వరల్డ్ లో భలేగా సందడి చేస్తోంది. ఈ పాటను హిందీలో “ముసాఫిర్’గా రూపొందించారు. ఇదే పాటను తమిళంలో ‘పయానీ’ పేరుతో, మళయాళంలో ‘యాత్రవ్వరన్’ పేరుతో తెరకెక్కించడం విశేషం! ప్రముఖ తెలుగు కొరియోగ్రాఫర్ జానీ ‘సంచారి’ పాటలో ప్రధాన పాత్రలో కనిపించారు. దక్షిణాది భాషల్లో జానీ కనిపించగా, హిందీ ‘ముసాఫిర్’ పాటలో మాత్రం టీవీ యాక్టర్ శివిన్ నారంగ్ దర్శనమిచ్చాడు. అన్ని పాటల్లోనూ శ్రష్టి వర్మ నాయికగా కనిపించింది. మిగిలిన వారందరూ అన్నిటా సందడి చేశారు. ఈ పాటలు ఇలా సోషల్ మీడయాలో ప్రత్యక్షం అయ్యాయో లేదో వరుసగా టాప్ స్టార్స్ ఐశ్వర్యను అభినందించడం ఆరంభించారు. మన సూపర్ స్టార్స్ చిరంజీవి, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రానా, మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, దుల్కర్, విజయ్ ఏసుదాస్ అభినందించినవారి జాబితాలో ఉన్నారు. మళ్ళీ మెగాఫోన్ పట్టినందుకు ఐశ్వర్యను అభినందనజల్లుల్లో ముంచెత్తారు వీరందరూ. ఐశ్వర్య సైతం తనను అభినందించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ సామాజిక మాధ్యమంలో సందడి చేస్తోంది.
తండ్రి సూపర్ స్టార్, భర్త ధనుష్ యంగ్ సూపర్ హీరోగా సాగుతున్న సమయంలోనే ఐశ్వర్య ‘3’ సినిమాతో మెగాఫోన్ పట్టి అలరించింది. ఆ తరువాత కూడా ‘వాయ్ రాజా వాయ్’ అనే బ్లాక్ కామెడీతో తనదైన బాణీ పలికించింది. ‘సినిమా వీరన్’ అనే డాక్యుమెంటరీతోనూ ఆకట్టుకుంది. ధనుష్ తో విడిపోయిన తరువాత ఐశ్వర్య కొంతకాలం మౌనం దాల్చారు. పైగా కోవిడ్ కల్లోలం సమయంలోనే తరువాత ఏం చేయాలి అన్న ప్రణాళిక రూపొందించుకున్నారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ‘సంచారి’ పాటతో సందడి చేస్తోందని చెప్పవచ్చు. ‘సంచారి’ అలా వచ్చిందో లేదో ఇలా వ్యూస్ పెరిగిపోతున్నాయి. ఈ పాట రూపకల్పనలో ఐశ్వర్యకు ప్రేరణ అరోరా కూడా తోడయ్యారు. పాట కాన్సెప్ట్, డైరెక్షన్ మాత్రం ఐశ్వర్యనే చూసుకున్నారు. తెలుగులో ఈ పాటను శ్రీమణి రాశారు. అన్ని భాషల్లోనూ అంకిత్ తివారీ స్వరకల్పన సాగింది. ఈ పాట అందించిన ఉత్సాహంతో మళ్ళీ ఐశ్వర్య రజనీకాంత్ ఓ సినిమా తెరకెక్కిస్తారేమో చూడాలి.
