26/11 ముంబై దాడులలో అమరుడైన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది ‘మేజర్’ చిత్రం. మహేష్ బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు ఎ ప్లస్ యస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన ‘మేజర్’ చిత్రం ఫిబ్రవరి 11, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదల కానుంది. ఇదిలా ఉంటే… ఈ యేడాది చివరి రోజున ‘మేజర్’ సినిమా హిందీ వర్షన్ డబ్బింగ్ ప్రారంభించాడు హీరో అడివి శేష్. తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ ఇండియా మూవీకి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా హిందీ వెర్షన్ లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెబుతున్నాడు అడివి శేష్. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘ఈ రోజు ‘మేజర్’ మూవీ హిందీ డబ్బింగ్ మొదలుపెట్టాను. 2022ను ఘనంగా ప్రారంభించుదాం” అంటూ ట్వీట్ చేశాడు.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బాల్యం, యవ్వనం, సైన్యంలో చేరిన అద్భుతమైన క్షణాల నుండి అతను అమరవీరుడైన ముంబై దాడి సంఘటనల వరకు అతని జీవితంలోని విభిన్న కోణాలను ఈ ‘మేజర్’ చిత్రంలో చూపించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్‌కి విశేషమైన స్పందన వస్తోంది. శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా హిందీ, తెలుగు, మలయాళంలో విడుదల కానుంది.
