Adhi Pinisetty: తండ్రి రవిరాజా పినిశెట్టి రీమేక్స్ లో కింగ్ గా సాగినా, తనయుడు ఆది పినిశెట్టి మాత్రం నటనతోనే రాణించాలని భీష్మించుకున్నాడు. అంతేనా, అటు ప్రతినాయకునిగానైనా అలరించగల నేర్పు, ఇటు కథానాయకునిగానూ మెప్పించగల ఓర్పు రెండూ తనలో ఉన్నాయని నిరూపించుకున్నారు ఆది. ఇప్పటికే పలు చిత్రాలలో విలక్షణమైన పాత్రల్లో సలక్షణంగా ఆకట్టుకున్న ఆది ఇకపై కూడా తన తడాఖా చూపిస్తానంటున్నారు.
ఆది పినిశెట్టి 1982 డిసెంబర్ 14న జన్మించారు. ఆది కన్నవారు రవిరాజా పినిశెట్టి, రాధారాణి. ఆది తండ్రి రవిరాజా 40కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వంలో చిరంజీవి ‘యముడికి మొగుడు’, బాలకృష్ణ ‘బంగారుబుల్లోడు’, వెంకటేశ్ ‘చంటి’, మోహన్ బాబు ‘పెదరాయుడు’, రాజశేఖర్ ‘మా అన్నయ్య’ వంటి సూపర్ హిట్, సూవర్ డూపర్ హిట్స్ ఉన్నాయి. రవిరాజా బాటలో పయనిస్తూ ఆయన పెద్ద కొడుకు సత్య ప్రభాస్ దర్శకుడు అనిపించుకున్నారు. చిన్న కొడుకు ఆది మాత్రం నటనలో అడుగు పెట్టారు. తేజ దర్శకత్వంలో దాసరి నారాయణరావు నిర్మించిన ‘ఒక ‘వి’చిత్రం’ ద్వారా ఆది నటనలో ప్రవేశించారు. తరువాత కొన్ని తమిళ చిత్రాలలోనూ నటించారు ఆది. తెలుగులో “గుండెల్లో గోదారి, మలుపు, సరైనోడు, అజ్ఞాతవాసి, రంగస్థలం, యు టర్న్, నీవెవరో” వంటి చిత్రాలలో నటించారు ఆది.
‘సరైనోడు, అజ్ఞాతవాసి’ చిత్రాలలో విలన్ గా కనిపించిన ఆది, ‘రంగస్థలం’లో కేరెక్టర్ రోల్ లో మురిపించారు.
కీర్తి సురేశ్ తో కలసి ‘గుడ్ లక్ సఖి’లోనూ, ఆకాంక్ష సింగ్ తో ‘క్లాప్’లోనూ వైవిధ్యమైన పాత్రల్లో కనిపించారు ఆది. రామ్ హీరోగా రూపొందిన ‘వారియర్’లోనూ ఆది తనదైన బాణీ పలికించారు. ప్రస్తుతం ‘పార్ట్ నర్’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారాయన. మునుముందు కూడా వైవిధ్యమైన పాత్రల్లో అలరించాలనే తపిస్తున్నారు ఆది.