Site icon NTV Telugu

Srikanth: వైవిధ్యమే శ్రీకాంత్ ఆయుధం!

Srikanth

Srikanth

“ఆశలు ఉంటాయి అందరికీ… అవి నెరవేరేదికి కొందరికే…”- “ఊహలు వస్తాయి అందరికీ… అవి సాకారమయ్యేదీ కొందరికే…” – ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. కానీ, కార్యసాధకులు అనుకున్నది సాధించేవరకూ నిద్రపోరనీ పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందరో ఆ మాటలకు అక్షరరూపం ఇచ్చినవారూ ఉన్నారు. అలాంటి వారిలో నటుడు శ్రీకాంత్ తానూ ఉన్నానని నిరూపించుకున్నారు. మొన్నటి దాకా హీరోగా సాగిన శ్రీకాంత్, స్టార్ డమ్ తగ్గగానే కేరెక్టర్ రోల్స్ లోనూ, విలన్ గానూ నటిస్తున్నారు. బాలకృష్ణ ‘అఖండ’లో శ్రీకాంత్ విలన్ గా తన పాత్రను సమర్థవంతంగా పోషించారు. ఈ యేడాది కూడా ‘వారసుడు’, ‘హంట్’ సినిమాల్లో శ్రీకాంత్ వైవిధ్యమైన పాత్రల్లో కనిపించారు. మునుముందు కూడా తన దరికి చేరిన పాత్రల్లో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్.

ఇప్పుడంటే కేరెక్టర్ రోల్స్, విలన్ వేషాలు వేస్తున్నారు కానీ, ఒకప్పుడు శ్రీకాంత్ స్టార్ గా సాగిన వైనాన్ని సినీ ఫ్యాన్స్ ఎవరూ మరచిపోలేరు. ఓ మధ్యతరగతి కుటుంబంలో 1968 మార్చి 23న శ్రీకాంత్ జన్మించారు. కర్ణాటకలో స్థిరపడ్డ తెలుగువారు కావడంతో శ్రీకాంత్ విద్యాభ్యాసం అటు, ఇటు సాగింది. చదువుకొనే రోజుల్లో చిరంజీవి వీరాభిమాని శ్రీకాంత్. స్వయంకృషితో చిత్రసీమలో మెగాస్టార్ గా రాణించిన చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని శ్రీకాంత్ సైతం నటనాభిలాషను పెంచుకున్నారు. సరైన అడుగులు వేస్తూ హైదరాబాద్ ‘మధు ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్’లో నటనా శిక్షణ తీసుకున్నారు. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ‘పీపుల్స్ ఎన్ కౌంటర్’ చిత్రంతో తొలిసారి తెరపై కనిపించారు శ్రీకాంత్. ఆరంభంలోనూ అందివచ్చిన పాత్రల్లో నటించారు శ్రీకాంత్. అలా నటునిగా గుర్తింపు సంపాదించిన శ్రీకాంత్ కు డి.రామానాయుడు నిర్మించిన ‘తాజ్ మహల్’ చిత్రం బ్రేక్ ఇచ్చింది. ఆ తరువాత కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘పెళ్ళిసందడి’ సినిమా ఘనవిజయం శ్రీకాంత్ ను స్టార్ హీరోగా నిలిపింది. ఆ సినిమా అప్పట్లో 23 కేంద్రాలలో 4 ఆటలతో రజతోత్సవం జరుపుకుని ఓ రికార్డ్ సృష్టించింది. చిన్నసినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన ‘పెళ్ళిసందడి’ గోల్డెన్ జూబ్లీ జరుపుకుంది. ఆ తరువాత శ్రీకాంత్ హీరోగా రూపొందిన అనేక చిత్రాలు జైత్రయాత్ర సాగించాయి. అయితే ‘పెళ్ళిసందడి’ స్థాయి సక్సెస్ మళ్ళీ శ్రీకాంత్ కు దక్కలేదు.

తన ఊహలను నిజం చేసుకొని కథానాయకునిగా వెండితెరపై వెలిగిపోయిన శ్రీకాంత్, తన జీవితనాయికగా నటి ఊహను ఆహ్వానించారు. వారికి ఇద్దరు అబ్బాయిలు, ఓ పాప. అబ్బాయిల్లో రోషన్ కూడా తండ్రి బాటలో పయనిస్తూ నటనలో అడుగుపెట్టాడు. ‘నిర్మలా కాన్వెంట్’లో తొలిసారి నటించిన రోషన్ ఆ మధ్య ‘పెళ్ళిసందD’లో హీరోగా కనిపించాడు. రోషన్ ను స్టార్ గా చూడాలని శ్రీకాంత్ లోని తండ్రి మనసు ఆరాటపడుతోంది. ఇక తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయాలనీ శ్రీకాంత్ భావిస్తున్నారు. శ్రీకాంత్ తనదైన అభినయంతో అలరిస్తారని ఆశిద్దాం.

Exit mobile version