(సెప్టెంబర్ 2న సుదీప్ పుట్టినరోజు)
తెలుగువారికి సైతం కన్నడ నటుడు సుదీప్ పేరు సుపరిచితమే! కొన్ని తెలుగు చిత్రాలలోనూ, మరికొన్ని అనువాద చిత్రాలతోనూ తెలుగువారిని ఆకట్టుకున్నారు సుదీప్. ఆయన నటనలో వైవిధ్యం తొణికిసలాడుతూ ఉంటుంది. విలక్షణమైన పాత్రల కోసం సుదీప్ పరితపించడమూ తెలిసిపోతుంది. కన్నడ నాట స్టార్ హీరోగా సక్సెస్ రూటులో సాగుతున్న సుదీప్, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తనను పలకరించిన విలక్షణమైన పాత్రల్లోకి ఇట్టే పరకాయప్రవేశం చేసి మెప్పించారు. కన్నడ చిత్రసీమలో ‘కిచ్చ’ సుదీప్ గా ఆయన సుప్రసిద్ధులు. తెలుగునాట “ఈగ, బాహుబలి, రక్తచరిత్ర” వంటి చిత్రాలలో వైవిధ్యమైన పాత్రల్లో అలరించారు.
సుదీప్ పూర్తి పేరు సుదీప్ సంజీవ్. ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లో పట్టా పొందిన సుదీప్ చదువుకొనే రోజుల్లో క్రికెట్ లో పిచ్చగా రాణించారు. ఇప్పటికీ క్రికెట్ అంటే ప్రాణం పెడతారు. మిత్రుల ప్రోత్సాహంతో కొన్ని నాటకాల్లో కూడా కనిపించారు. సుదీప్ కు సిగ్గు ఎక్కువగా ఉండడం వల్ల కీలక పాత్రలు పోషించలేకపోయారు. తనలోని బిడియాన్ని దూరం చేసుకోవడానికి అన్నట్టు సుదీప్ ముంబయ్ వెళ్ళి రోషన్ తనేజా స్కూల్ ఆఫ్ యాక్టింగ్ లో చేరారు. అక్కడే సుదీప్ నటనలో అనేక విషయాలు అధ్యయనం చేశారు.
‘తాయవ్వ’ అనే చిత్రంలో తొలిసారి నటించారు సుదీప్. తరువాత ‘స్పర్ష’ చిత్రంలో కీలక పాత్రతో గుర్తింపు సంపాదించారు. “హుచ్చ, కిచ్చ, నంది, స్వాతి ముత్తు, మై ఆటోగ్రాఫ్, కెంపే గౌడ, మాత్ మాతల్లి” వంటి చిత్రాల ద్వారా సుదీప్ కు విశేషమైన పేరు లభించింది. ముఖ్యంగా ‘కిచ్చ’ చిత్రంలో సుదీప్ నటన జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఆ తరువాత నుంచీ ‘కిచ్చ సుదీప్’గా పేరు సంపాదించారు. తెలుగు చిత్రాలతో పాటు హిందీ, తమిళ సినిమాల్లోనూ నటించి సుదీప్ ఆకట్టుకున్నారు. సల్మాన్ ఖాన్ వంటి స్టార్ తన ‘దబంగ్-3’లో సుదీప్ నే కీ రోల్ కు ఎంచుకున్నారు. అంటే సుదీప్ పేరు బాలీవుడ్ లోనూ ఎంతలా ప్రాచుర్యం పొందిందో ఊహించవచ్చు.
కన్నడ నాట స్టార్ హీరోగా సాగుతున్నా, సుదీప్ తన దరికి చేరిన పరభాషా చిత్రాల్లోని పాత్రలను సైతం అంగీకరించడం విశేషం. ప్రస్తుతం సుదీప్ ‘కె-3’లోనూ, ‘విక్రాంత్ రోణా’ అనే భారీ చిత్రంలోనూ కథానాయకునిగా నటిస్తున్నారు. ‘కె3’ దసరా కానుకగా విడుదల కానుంది. ఇక ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘విక్రాంత్ రోణా’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టీజర్, టైలర్ తో ఇప్పటికే అందరి దృష్టినీ ఆకర్షించాడు. సుదీప్ మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.