Brahmaji: టాలీవుడ్ లో నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పని ఏదో తాను చూసుకుంటూ వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటాడు. ఇక విలన్ గా, కమెడియన్ గా ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇప్పటివరకు బ్రహ్మాజీ వ్యక్తిగత విషయాలు ఎవరికి తెలియవు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన తన వ్యక్తిగత విషయాలతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. తనకు కోపం ఎప్పుడొస్తుంది అనే విషయమై ఆయన మాట్లాడుతూ.. “కామ్ గా ఉంటాను అంటే కోపం రాదు అని కాదు. కానీ ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోను.. ఇటీవల నాకు బాగా కోపం వచ్చింది ఎక్కడంటే.. సమంత విడాకుల విషయంలో. ఆమె రూ. 250 కోట్లు భరణం తీసుకుందని, చీప్ క్యారెక్టర్ అని ఎవరో ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు. దానికి ఆమె కూడా ఏదో కోట్ పెట్టి రిప్లై ఇచ్చింది. అది వేరే విషయం. అయితే ఆ మాటలకూ నాకు కోపం వచ్చింది. అసలు వారి పర్సనల్ మ్యాటర్స్ గురించి మాట్లాడానికి నువ్వు ఎవరు అని అడిగాను.
ఒక సెలబ్రిటీతో మాట్లాడే అవకాశం వచ్చిందని సంతోష పడు. ఆమె నీతో మాట్లాడాలంటే ఎన్ని సంవత్సరాలు ఎదురుచూడాలో తెలుసా..? ఆమె గురించి నువ్వు మాట్లాడుతున్నావ్. ఆమె ఎంతో కష్టపడి పైకి వచ్చింది. ఎవరి సాయం లేకుండా స్టార్ గా ఎదిగింది. నిజానిజాలు తెలియకుండా నువ్వు ఎలా మాట్లాడతావ్.. ఆమె గురించి అని నేను రిప్లై ఇచ్చాను. నిజం చెప్పాలంటే సమంత ఫ్రెండ్స్ కూడా ఎవరు రియాక్ట్ కాలేదు. కానీ నాకు మాట్లాడాలనిపించింది. అందుకే మాట్లాడాను. ఆ సమయంలో నాకు కోపం వచ్చింది” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. సమంత పై అనవసరంగా ట్రోల్స్ చేస్తున్నవారు బ్రహ్మాజీ మాటలు విని అయినా మారండి అంటూ సామ్ అభిమానులు చెప్పుకొస్తున్నారు.