అప్పుడప్పుడూ వినోదంలో ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. వినోదం కోసం తెరకెక్కించే సినిమాల చిత్రీకరణలోనూ కొన్ని ప్రమాదకర సంఘటనలు చోటు చేసుకోవడం కొత్తేమీ కాదు. హాలీవుడ్ నటుడు అలెక్ బాల్డ్ విన్ తన తాజా చిత్రం “రస్ట్” షూటింగ్ సమయంలో సినిమాలో ఉపయోగించే ప్రాప్ గన్ ను పేల్చారు. దాంతో ఆ చిత్రానికి పనిచేస్తున్న సినిమాటోగ్రాఫర్ హాలీనా హట్ చిన్స్ అక్కడే మరణించగా, డైరెక్టర్ జోయెల్ సోజా గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Read Also : ‘నాట్యం’ బృందానికి ఉప రాష్ట్రపతి ప్రశంసలు!
మెక్సికోలో అలెక్ బాల్డ్ విన్ నటిస్తున్న ‘రస్ట్’ షూటింగ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. అక్కడి షరీఫ్ కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ‘అలెక్ సెట్ ప్రాపర్టీస్ లోని గన్ తో పేల్చడంతో ఈ సంఘటన చోటు చేసుకుందని’ షరీఫ్ చెబుతున్నారు. ఈ సంఘటనతో షాక్ గురయిన అలెక్ బాల్డ్ విన్ ప్రస్తుతం కన్నీరు మున్నీరు అవుతున్నాడు. అనేక చిత్రాలలో తనదైన అభినయంతో ఆకట్టుకున్న అలెక్ బాల్డ్ విన్ ఇలాంటి సంఘటనలో చిక్కుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. మార్టిన్ స్కార్ససే రూపొందించిన “ది ఏవియేటర్, ద డిపార్టెడ్” వంటి చిత్రాలలో అలెక్ బాల్డ్ విన్ అభినయం ఆకట్టుకుంది. అనేక చిత్రాలలో ఆయన కామెడీ సైతం జనాన్ని విశేషంగా అలరించింది. దాంతో అలెక్ కు ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం పట్ల కొందరు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఇక లేడీ సినిమాటోగ్రాఫర్ హాలీనా హట్ చిన్స్ మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. తన వృత్తిని ఎంతో ప్రేమిస్తూ, కళకు అంకితమైన వారు కొద్దిమందే కనిపిస్తారు. అలాంటి వారిలో హాలీనా ప్రత్యేక స్థానం సంపాదించారు. భవిష్యత్ లో సినిమాటోగ్రాఫర్ గా హాలీనా ఎన్నో విజయాలు సాధిస్తారని ఆశించామని, ఇలా ఆమె ప్రాప్ గన్ కాల్పుల్లో కన్నుమూయడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని సన్నిహితులు ఆవేదన చెందుతున్నారు. ఏది ఏమైనా అసలు ఆ ప్రాప్ గన్ లో ఒరిజినల్ బుల్లెట్స్ ఎలా చోటు చేసుకున్నాయి అన్న దానిపై డిటెక్టివ్స్ పరిశోధిస్తున్నారు. అలెక్ బాల్డ్ విన్ మాత్రం తన కారణంగా హాలీనా హట్ చిన్స్ కన్నుమూయడం జీర్ణించుకోలేక పోతున్నాడు. ఇదంతా ఓ పీడకల అయి, మళ్ళీ హాలీనా వస్తే ఎంత బాగుంటుందనీ విలపిస్తున్నాడు. మరి ప్రాప్ గన్ లోకి ఒరిజినల్ బుల్లెట్స్ ఎలా వచ్చాయన్నది తేలేదాకా అందరూ అలెక్ ను దోషిగానే చూస్తారు.
