మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన ‘ఆచార్య’ సినిమా ట్రైలర్ జనం ముందు నిలచింది. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై సురేఖ కొణిదెల సమర్పణలో మ్యాటినీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కింది. కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. చిరంజీవితో రామ్ చరణ్ కలసి గతంలో ‘మగధీర, బ్రూస్లీ, ఖైదీ నంబర్ 150’ చిత్రాలలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే, తండ్రితో కలసి రామ్ చరణ్ పూర్తి స్థాయిలో నటించిన చిత్రం ‘ఆచార్య’ అనే చెప్పాలి. ఇందులో రామ్ చరణ్ కీలకమైన పాత్ర పోషించారు. కథ ఆయన చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. అందువల్ల ‘ఆచార్య’ ట్రైలర్ ఏప్రిల్ 12 సాయంత్రం 5.49 నిమిషాలకు విడుదలవుతోందని తెలిసినప్పటి నుంచీ అభిమానుల్లో ఉత్సాహం ఉరకలు వేసింది. ఇది చిరంజీవి నటించిన 152వ చిత్రం కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటకల్లో ఎంపిక చేసిన 152 థియేటర్లలో ప్రకటించిన సమయానికి ‘ఆచార్య’ ట్రైలర్ ను ప్రదర్శించారు.
“దివ్యవనమొకవైపు… తీర్థజనమొకవైపు… నడుమ పాదఘట్టం…” అంటూ రామ్ చరణ్ వాయిస్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. “ఆపద వస్తే ఆ అమ్మోరు తల్లే మమ్మల్ని ఆవహించి ముందుకు పంపుతుంది…” అంటూ యాక్షన్ మొదలవుతుంది. తమ ‘ధర్మస్థలిని అధర్మస్థలి ఎలా అవుతది?’ అనే ప్రశ్న వినిపిస్తుంది. 2 నిమిషాల 32 సెకండ్ల పాటు రూపొందిన ఈ ట్రైలర్ లో అభిమానులను అలరించే పలు అంశాలు చోటు చేసుకున్నాయి. యాక్షన్ సీన్స్ చిత్రంలో ఏ స్థాయిలో ఉండబోతున్నాయో మచ్చుకు కొన్ని ఇందులో చూపించారు. సగం ట్రైలర్ లో రామ్ చరణ్ కనిపిస్తారు. తరువాత చిరంజీవి ఎంట్రీ ఉంటుంది. ఆ పై అదరహో అనే స్థాయిలో యాక్షన్ విజువల్స్ కనిపిస్తాయి. సోనూ సూద్ ఎదురుగా చిరంజీవి కుర్చీలో కూర్చున్న స్టైల్ చూస్తే ‘ఇంద్ర’ సినిమాలో విలన్స్ ఇంటిలో చిరంజీవి కూర్చుని వార్నింగ్ ఇచ్చే సీన్ గుర్తుకు రాకమానదు. చివరలో “సిద్ధా తెలుసా మీకు…” అంటూ తనికెళ్ళ భరణి, చిరంజీవిని ప్రశ్నించగానే “కామ్రేడ్…” అంటూ పిలుపు వినిపిస్తుంది. దీనిని బట్టి, ‘ఆచార్య’లో నక్సలిజమ్ నేపథ్యం కూడా చోటు చేసుకుందని తెలిసిపోతుంది. తరువాత చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ కామ్రేడ్స్ డ్రెస్ లో కనిపించే విజువల్స్ అభిమానులకు కన్నుల పండుగ కలిగించక మానవు.
ఎంపిక చేసిన 152 థియేటర్లలో ఈ ట్రైలర్ ను అనుకున్న సమయానికి ప్రదర్శించారు. తరువాత కొంత వ్యవధిలోనే యూ ట్యూబ్ లో ఈ ట్రైలర్ ప్రత్యక్షమయింది. అలా పెట్టారో, ఇలా ఈ ట్రైలర్ ను చూసే వీక్షకుల సంఖ్య చకచకా పెరిగిపోతోంది. మరి ఈ ట్రైలర్ ఎలాంటి రికార్డులు సొంతం చేసుకుంటుందో చూడాలి.
