Acharya Athreya Birth Anniversary: ఆచార్య ఆత్రేయ పాటలు రాయవలసిన పనిలేదు, ఆయన మాటలే పాటలుగా మారతాయి అనే మాట ఈ నాటికీ తెలుగునాట ప్రతీపూట ఏదో చోట వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా చిత్రసీమలో గీతరచయితలుగా రాణించాలనుకొనే వారు ఆత్రేయ బాటనే ఎంచుకుంటూ ఉంటారు. ఆయన బాటలోనే పయనిస్తూ తమ మాటలను పాటలుగా మలిచే ప్రయత్నం చేస్తూంటారు. ఆత్రేయ తరువాత చిత్రసీమలో గీత రచయితలుగా అడుగు పెట్టినవారెవరూ ఆయన ప్రభావం నుండి తప్పించుకోలేక పోయారనే చెప్పాలి. ఆత్రేయ ముందు తరం వారైన సముద్రాల రాఘవాచార్య, పింగళి నాగేంద్రరావు బాణీకి దూరంగా జరిగి, అలతి అలతి పదాలతోనే అనల్పమైన అర్థాలు చెప్పే ప్రయత్నం చేశారు ఆత్రేయ. ఆయన కలం పలికించిన పాటలు ఈ నాటికీ తెలుగువారి మనసుల్లో చిందులు వేస్తూనే ఉన్నాయి. ఇక ‘మన’ సుకవిగానూ, ‘మనసు’ కవిగానూ ఆత్రేయ జేజేలు అందుకుంటూనే ఉండడం విశేషం!
ఆచార్య ఆత్రేయ అసలు పేరు కిళాంబి వేంకట నరసింహాచార్యులు. 1921 మే 7న నెల్లూరు జిల్లా సూళ్ళూరు పేట సమీపంలోని మంగళం పాడు గ్రామంలో జన్మించారు ఆత్రేయ. చదువుకొనే రోజుల్లోనే ఆదర్శ భావాలు పలికిస్తూ పాటలు, నాటకాలు రాసి అలరించారు. ‘క్విట్ ఇండియా ఉద్యమం’లో పాల్గొనడానికి చదువును వదిలేశారు. జైలుకు వెళ్ళారు. విడుదలై వచ్చాక ‘జమీన్ రైతు’ పత్రికలో అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేశారు. ఆత్రేయ కలం నుండి జాలువారిన పలు నాటికలు, నాటకాలు జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. వాటిలో “భయం, విశ్వశాంతి, కప్పలు, గౌతమబుద్ధ, అశోక సమ్రాట్, పరివర్తనం, ఎదురీత, ఎన్జీవో” వంటివి విశేషాదరణ చూరగొన్నాయి. నాటకాల్లో ఆయన పలికించే పదాలు విని అనేక సినిమా జీవులు మురిసిపోయేవారు. ఆత్రేయ గురించి గోపీచంద్ ద్వారా తెలుసుకున్న ప్రముఖ నిర్మాత, దర్శకులు కె.ఎస్. ప్రకాశరావు తన ‘దీక్ష’ చిత్రం ద్వారా ఆత్రేయను చిత్రసీమకు పరిచయం చేశారు. ‘దీక్ష’లో ఆత్రేయ రాసిన తొలి పాట “పోరా బాబూ…పోయి చూడు లోకం పోకడ…” ఆ రోజుల్లో విశేషంగా జనాన్ని ఆకట్టుకుంది. ఆరంభంలో కొందరు ఆత్రేయతో కేవలం మాటలే రాయించుకున్నారు. కొందరు అడపాదడపా పాటలు రాసే అవకాశం కల్పించారు. ఏది రాసినా, అందులో తనదైన బాణీ పలికించేవారు ఆత్రేయ.
అన్నపూర్ణ వారి ‘తోడికోడళ్ళు’లో ఆత్రేయ రాసిన “కారులో షికారు కెళ్ళే పాల బుగ్గల పసిడిచానా…” పాట ఆ రోజుల్లో యువకులను ఎంతగానో మురిపించింది. అలాగే ‘ముందడుగు’లోని “కోడెకారు చిన్నవాడా… వాడిపోని వన్నెకాడా…” సాంగ్ మరింతగా అలరించింది. ఇలా పాటలు రాసుకుంటూ, మాటలు పలికిస్తూ ఆత్రేయ చిత్రప్రయాణం సాగింది. ‘శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’ చిత్రంలో ఆత్రేయ రాసిన మాటలు, ఆయన కలం పలికించిన “శేషశైలా వాసా…” పాట జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమా ఘనవిజయం తరువాత ఆత్రేయ గీతరచన కూడా ఊపందుకుంది.
ఆదుర్తి సుబ్బారావు ఆత్రేయను బాగా ప్రోత్సహించారు. ఆదుర్తి చిత్రాలకు ఆత్రేయ రాసిన అనేక పాటలు పండితపామరులను రంజింప చేశాయి. కొన్ని చిత్రాలలో మాటలు-పాటలు రెండూ ఆత్రేయనే పలికించేవారు. సాంఘికాల్లోనే కాదు పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాల్లోనూ ఆచార్య ఆత్రేయ తనదైన పంథాలో పాళీని పరుగులు తీయించారు. పసందైన పాటలు పలికించారు. తెలుగువారిని రంజింప చేశారు. జగపతి ఆర్ట్ పిక్చర్స్, సురేశ్ ప్రొడక్షన్స్, విశ్వశాంతి, యువచిత్ర వంటి నిర్మాణ సంస్థలు ఆత్రేయను తమ ఆస్థాన కవిగా ఏర్పాటు చేసుకున్నాయి. ఆత్రేయ పాటలు లేకుండా సినిమాలు తీయలేమనీ కొందరు నిర్మాతలు అనేవారు. అలాగే ఆత్రేయ కన్నుమూసిన తరువాత వారు తమ మాటపై నిలచి సినిమా నిర్మాణానికి దూరంగా జరిగారు. అంతలా అభిమానం సంపాదించారు ఆత్రేయ. ఆయన గీతరచనలో చివరగా వెలుగు చూసిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. 1989 సెప్టెంబర్ 13న ఆచార్య ఆత్రేయ తుదిశ్వాస విడిచారు. ఎందరో భావి సినీగేయరచయితలకు ఆత్రేయ పాట బాట చూపింది. ఆ దారిలో పయనించిన వారెందరో నేడు చిత్రసీమలో గీత రచయితలుగా అలరిస్తూ ఉన్నారు.