ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు తనయుడు అభిరామ్ దగ్గుబాటి హీరోగా పరిచయం కాబోతున్న సినిమా ‘అహింస’. దీనిని తేజ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ లో కిరణ్ నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ ‘అహింస’ మూవీకి స్వర రచన చేస్తున్నారు. కెరీర్ బిగినింగ్ డేస్ లో తేజ, ఆర్పీ కాంబోలో సూపర్ డూపర్ మ్యూజికల్ హిట్స్ వచ్చాయి.
అయితే ఆ తర్వాత ఇద్దరూ తమ పంథాల్లో సాగిపోయారు. అడపాదడపా కలిసి పనిచేసినా…. మళ్ళీ గ్యాప్ వచ్చింది. దాన్ని పూడ్చుతూ ఇప్పుడు మరోసారి వీరు ‘అహింస’ కోసం కలిశారు. ఇదిలా ఉంటే ‘అహింస’ సినిమాను సురేశ్ బాబుతో పాటు తేజ సైతం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎప్పటికప్పుడు రషెస్ చూసుకుంటూ, సంతృప్తికరంగా రాని వాటిని రీషూట్ చేస్తూ, బెస్ట్ అవుట్ పుట్ కోసం కృషి చేసినట్టు తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన కేవలం పది రోజులు షూటింగ్ మాత్రం బాలెన్స్ ఉందని, దానిని త్వరలోనే పూర్తి చేసి గుమ్మడి కాయ కొట్టేస్తారని అంటున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ‘అహింస’కు కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్. టోటల్ మూవీ పూర్తి అయిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి వివరాలను, విడుదల తేదీని ప్రకటించే ఆస్కారం ఉందని తెలుస్తోంది.
